తెలంగాణ

telangana

ETV Bharat / state

మాజీ రాష్ట్రపతి చదివిన 154 ఏళ్ల గడియారం పాఠశాల నేలమట్టం

చరిత్ర నెమ్మదిగా కనుమరుగవుతోంది. హైదరాబాద్ నగరంలో వందల ఏళ్ల నాటి కట్టడాలెన్నో ఇప్పటికే కాలగర్భంలో కలిసిపోగా మరెన్నో పర్యవేక్షణ లేక శిథిలమైపోతున్నాయి. ఇటీవల నగరంలో వర్షాలకు చౌమహల్లా ప్యాలెస్‌ కిటికీ దిమ్మె కూలింది. ఉస్మానియా ఆసుపత్రిలోకి నీరు చేరి భవనాలు పెచ్చులూడి పడ్డాయి. పునరుద్ధరణ పనులు చేపట్టినా.. మోజంజాహీ మార్కెట్‌లోకి వర్షపు నీరు చేరింది. వందల ఏళ్ల పాటు దృఢంగా ఉన్న చారిత్రక కట్టడాలు ముందస్తు పర్యవేక్షణ లోపం వల్ల శిథిలమైపోతున్నాయి.

clock school
clock school

By

Published : Sep 2, 2020, 9:40 AM IST

సుమారు 154 ఏళ్ల చరిత్ర... బ్రిటిష్‌ కాలం నాటి పాఠశాల.. ఎందరెందరో ప్రముఖులు విద్యాబుద్ధులు నేర్చుకున్న తరగతి గదులు. గడియారం పాఠశాల, క్లాక్‌టవర్‌ పాఠశాలగా ఎంతో ప్రాముఖ్యం పొందిన హైదరాబాద్ సుల్తాన్‌ బజార్‌ ప్రాథమికోన్నత పాఠశాల పైకప్పు గురువారం కుప్పకూలింది. వరుస వర్షాలకు నాని ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు పాఠశాలలో పిల్లలు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 1866లో చాదర్‌ఘాట్‌ వెర్నాక్యులర్‌ హైస్కూల్‌ను బ్రిటిష్‌ హయాంలో ప్రారంభించారు. ఆంగ్లంతో పాటు స్థానిక భాషను తమ పిల్లలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో అక్కడి వ్యాపారులు చందాలు వేసుకుని దీనిని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.

ఎందరో ప్రముఖులు చదివారు

మాజీ రాష్ట్రపతి జాకీర్‌ హుస్సేన్‌, మాజీ ముఖ్యమంత్రి టి.అంజయ్య, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమారుడు పీవీ రంగారావుతో పాటు ప్రస్తుత ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు ఈ పాఠశాలోనే విద్యనభ్యసించారు. పాఠశాలకు మరమ్మతులు చేయాలని గతేడాది నవంబర్‌లోనే హెచ్చరించినా ఎవరూ పట్టించుకోలేదని ఇండియన్‌ నేషనల్‌ ట్రస్ట్‌ ఫర్‌ ఆర్డ్‌ అండ్‌ కల్చర్‌ హెరిటేజ్‌ (ఇంటాక్‌) ప్రతినిధులు చెబుతున్నారు. నవంబర్‌ నెలలో హెరిటేజ్‌ వాక్‌లో పాఠశాల భవనాన్ని పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని సూచించినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు.

వర్షం పడితే చాలు...

మోజంజాహీ మార్కెట్‌ పునరుద్ధరణ పనులు 2018లో ప్రారంభించగా ఇటీవలే పూర్తయ్యాయి. రెండు మూడు రోజుల వ్యవధిలోనే వర్షపు నీరు వచ్చి చేరింది. నానిన గోడలు, పైకప్పుల్ని చూసి రూ.కోట్లు వ్యయం చేసినప్పటికీ వర్షపు నీరు చేరడం ఏంటంటూ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.క్యూరింగ్‌ చేయకపోవడం వల్లేనని అధికారులు అంటున్నారు.

నిరంతర పర్యవేక్షణ అవసరం

ఏఎస్‌ఐ కింద గోల్కొండ, చార్మినార్‌, కొండాపూర్‌ మ్యూజియం ఉన్నాయి. పురావస్తు శాఖ కింద చారిత్రక, వారసత్వ కట్టడాలు ఉన్నాయి. తారామతి బారాదరి, కుతుబ్‌షాహీ టూంబ్స్‌, బ్రిటీష్‌ రెసిడెన్సీ, హజ్రత్‌ సయ్యద్‌ షా దర్గా, గన్‌ఫౌండ్రీ, హజ్రత్‌ సైదాని, అర్మెనియన్‌ సిమెట్రీ, హకీమ్స్‌ టూంబ్‌, ఖైరత్‌ఖాన్‌ టూంబ్‌, ఖైరతీబేగం సమాధి, మక్కా మసీదు, ఖుల్సుంబేగం మసీదు, ఖజానా భవనం, ముషీరాబాద్‌ మసీదు, ఓల్డ్‌ ఈద్గా, షేక్‌పేట్‌ దర్గా, షంషీర్‌ కోట, రొనాల్డ్‌రాస్‌ భవనం, టోలి మసీదు అషుర్‌ఖానా ప్రాంగణంలోని నిర్మాణాలు, ఖైరునిస్సా టూంబ్‌, ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న సైదానిమా టూంబ్‌, పైగా టూంబ్స్‌, మౌలాలీలోని కమాన్‌ వంటివి నిరంతర పర్యవేక్షణను నోచుకోక శిథిలమైపోతున్నాయి.

కొన్ని చోట్ల భూవివాదాలు, మరికొన్ని చోట్ల నిర్వహణా లోపంతో కాలగర్భంలో కలిసిపోయేలా ఉన్నాయని చరిత్రకారులు, వారసత్వ కట్టడాల పరిరక్షణ ఉద్యమకారులు ఆవేదన చెందుతున్నారు. నగరంలో సుమారు 42 వరకు చారిత్రక కట్టడాలు రాష్ట్ర పురావస్తుశాఖ నిర్వహణలో ఉన్నాయని, వాటిని సంబంధిత శాఖ అధికారులు లక్ష్యపెట్టక పోవడంతో శిథిలమై పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details