కరోనా కేసులు గత కొద్ది రోజులుగా గణనీయంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో బుధవారం ఏకంగా 30 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. అదే పరంపరను కొనసాగిస్తూ.. గురువారం 27 మందికి వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఏప్రిల్ 7 నాటికి అంతా సర్దుకుంటుందని భావించిన సర్కారు ఆశలు.. నీరు గారాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 154కు చేరగా.. వీరిలో ఇప్పటికే 17మంది కోలుకుని డిశ్చార్జయ్యారు. మరో 9మంది చనిపోయారు.
దిల్లీ మర్కజ్ వెళ్లి వచ్చిన వారే
రాష్ట్రంలో ప్రస్తుతం వైరస్ సోకి చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 128కి చేరింది. వీరిలో అత్యధికులు దిల్లీ మర్కజ్ వెళ్లి వచ్చిన వారే అని సమాచారం. మర్కజ్ కేసులు గత నెల 28 నుంచి వెలుగుచూస్తున్నాయి. అంతకుముందు ఇండోనేషియా నుంచి వచ్చినవారు దిల్లీ నుంచే వచ్చినట్లు సమాచారం ఉన్నప్పటికీ సర్కారు పెద్దగా దృష్టి సారించలేదు. కేంద్రం ఆదేశాలతో ఎక్కువగా అంతర్జాతీయ ప్రయాణికుల వివరాలను ఆరా తీసి వారికి పరీక్షలు చేసింది.
అంతా సర్దుకుంటోందని..
గత నెల రోజుల్లో కేసులు నమోదైన తీరుని గమనిస్తే.. ఇటీవలి కాలంలో భారీగా పెరిగినట్లు స్పష్టం అవుతోంది. మార్చి 2న మొట్టమొదటి సారిగా దుబాయ్ నుంచి వచ్చిన సాఫ్ట్వేర్ ఉద్యోగికి వైరస్ సోకినట్లు ప్రభుత్వం నిర్ధరించింది. అతను గత నెల 11న గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు మరొక్క కేసు కూడా వెలుగుచూడలేదు. అంతా సర్దుకుంటోందని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో.. 15,16తేదీల్లో ఒక్కో కరోనా కేసులు నమోదయ్యాయి.