దేశవ్యాప్తంగా 151 ప్రైవేటు రైళ్లను పట్టాలెక్కించే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన రైల్వేశాఖ తదుపరి రైల్వే స్టేషన్లపై దృష్టి సారిస్తోంది. స్టేషన్ల ప్రాధాన్యత ఆధారంగా మూడు దశల్లో ప్రైవేటు సంస్థలతో కలిసి పునరాభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.
ఇప్పటికే సికింద్రాబాద్ స్టేషన్ ఈ జాబితాలో ఉండగా.. తాజాగా తెలంగాణలోని మరో 14 స్టేషన్లను ఎంపిక చేసింది. సికింద్రాబాద్‌ను మొదటిదశలో చేర్చగా, వరంగల్ స్టేషన్ తాజాగా ఆ జాబితాలోకి వచ్చింది. కాచిగూడను రెండో దశలో చేర్చారు. ఈ స్టేషన్ పరిధిలో ఉన్న ఖాళీ స్థలాలను ఎలాంటి అవసరాలకూ కేటాయించవద్దంటూ రైల్వేబోర్డు తాజాగా ద.మ.రైల్వేకు స్పష్టం చేసింది.
పెత్తనం అంతా వారిదే
వాణిజ్య ఆదాయాన్ని పెంచుకోవడంతోపాటు, ప్రయాణికులకు మెరుగైన సదుపాయాల పేరుతో రైల్వేశాఖ స్టేషన్ల పునరాభివృద్ధి (రీడెవలప్‌మెంట్) ప్రాజెక్టును ముందుకు తీసుకొచ్చింది. దీనికోసం ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌ఎస్‌డీసీ)ని రైల్వేశాఖ ఇప్పటికే ఏర్పాటుచేసింది.
స్టేషన్ ప్రాంగణం, చుట్టపక్కల ఖాళీ స్థలాల్లో షాపింగ్‌మాళ్లు, థియేటర్లు వంటివి నిర్మించే దిశగా ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పించడం దీని లక్ష్యం. స్టేషన్ లోపల నిరీక్షణ సముదాయాలు(వెయిటింగ్ రూమ్‌లు), రెస్టారెంట్లు, దుకాణాలు, పారిశుద్ధ్యం, వాహనాల పార్కింగ్ సహా స్టేషన్ల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం అందులో భాగమే.