గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎప్పుడు ఎక్కడ ఏ హత్య జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మూడు కమిషనరేట్ల పరిధిలో దుండగులు బాహాటంగానే కత్తులతో దాడి చేసి హతమారుస్తున్నారు. ఈ హత్యలకు పాతకక్షలు, వివాహేతర సంబంధాలే ఎక్కువ కారణాలుగా ఉంటున్నాయి.
ఈనెలలో జరిగిన హత్యల వివరాలు
- ఈ నెల 5న సనత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధి బోరబండ శివాజీనగర్‌లో డబ్బు కోసం మద్యం మత్తులో 80 ఏళ్ల వృద్ధురాలు సుందరమ్మను ఓ దుండగుడు దారుణంగా హత్య చేసి పరారయ్యాడు.
- ఈ నెల 7న రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధి అత్తాపూర్ రాంబాగ్‌లో ఓ వ్యక్తి గృహిణిని ఇంట్లోనే హత్య తాళం వేసి వెళ్లిపోయాడు. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
- చైతన్యపురి ఠాణా పరిధిలోని బాలాజీనగర్‌లో ఈ నెల 11వ తేదీన భార్యతో మాట్లాడుతున్నాడనే అనుమానంతో భర్త రవి ప్రణీత్ రెడ్డి అనే యువకుడిని కొట్టి తూకం బాట్లతో తలపై మోదీ హతమార్చాడు.
- ఈ నెల 12న దుండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలో సురారం భవానీనగర్‌లో కుటుంబ కలహాలతో అర్ధరాత్రి భార్య శిల్పను రోకలిబండతో తలపై బలంగా మోదడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
- ఈ నెల 20న అర్ధరాత్రి నగర శివారు మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి చెంగిచర్లలో పరమేశ్ అనే వ్యక్తి అతని సహచరులు కత్తులతో పొడిచి హత్య చేశారు.
ఒక్కరోజు వ్యవధిలోనే ఆరు వరుస హత్యలు
ఇదిలా ఉంటే 12గంటల వ్యవధిలోనే నగర నడిబొడ్డున ఆరు వరుస హత్యలు జరగడం తీవ్ర కలకలం సృష్టించాయి. ఇవాళ మెహదీపట్నం పరిధిలో ఓ మహిళను గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గచ్చిబౌలి మసీదుబండలో బాలిక అనుమానాస్పదంగా మృతి చెందింది. మృతురాలు వనపర్తికి చెందిన బాలికగా గుర్తించారు. అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్ పరిధిలో కడప నుంచి వచ్చిన సాయికుమార్ అనే యువకున్ని అతని సహచర మిత్రులే నడి బజారులో దారుణంగా పొడిచి చంపారు. వీరిమధ్యన చోటుచేసుకున్న చిన్నపాటి గొడవే హత్యకు దారితీసింది. ఈ ఘటనకు కొన్ని గంటల వ్యవధిలోనే పాతబస్తీలోని కాలపత్తర్ ఠాణా పరిధిలో అహ్మద్ అనే వ్యక్తిని అక్రమ సంబంధం కారణంగా 9మంది కలిసి కత్తులు, వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. నిందితుల్లో ఓ మైనర్ కూడా ఉన్నాడు. దీని తర్వాత కొండాపూర్‌లో అనంతపురానికి చెందిన సత్యనారాయణ అనే పాస్టర్ ద్విచక్ర వాహనంపై వెళుతుండగా దారికాసిన దుండగులు కత్తులతో దాడి చేసి పరారయ్యారు. ఈ ఘటనలో పాస్టర్ సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. హత్యకు గల కారణాలపై పోలీసులు విచారణను వేగవంతం చేస్తున్నారు.
కత్తులతో వీరంగం