కరోనా మహమ్మారి బారిన పడి కోలుకున్న 15 మంది బాధితులను శనివారం గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి చేసి, ఇళ్లకు పంపారు. వ్యాధి నిర్ధరణ అయినప్పటి నుంచి వారు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆరోగ్యం మెరుగుపడటం వల్ల ఇంటికి పంపిస్తున్నట్లు వైద్యులు ప్రకటించగానే వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఆనందంగా ఇంటి బాట పట్టారు. వైద్యులు తమలో ఆత్మస్థైర్యాన్ని నింపి, మెరుగైన సేవలు అందించడంతో త్వరగా కోలుకున్నామని తెలిపారు. 24 గంటల వ్యవధిలో రెండుసార్లు చేసిన పరీక్షల్లో ఈ 15 మందికి నెగిటివ్ రావడం వల్ల డిశ్ఛార్జి చేశారు. మరో 14 రోజులు ఎవరినీ కలవకుండా ఇంట్లోనే ఉండాలని వారికి సూచించినట్లు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్‌కుమార్ తెలిపారు. వీరితో కలిపి ఇప్పటివరకు 19 మందిని గాంధీ నుంచి డిశ్ఛార్జి చేశామన్నారు.
ఒకరి పరిస్థితి కొంత విషమం
ఈ ఆసుపత్రిలో మరో 83 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతుండగా, వారిలో ఒకరి పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితుల్లో ఒక్క వరంగల్ వారే 25 మంది ఉన్నారని పేర్కొన్నారు. ఇంకా 464 మందిని ఐసోలేషన్‌లో ఉంచామని చెప్పారు. వీరి నమూనాలను పరీక్షలకు పంపామని, నివేదికల కోసం ఎదురు చూస్తున్నట్లు డాక్టర్ శ్రావణ్‌కుమార్ తెలిపారు.
ఛాతీ ఆసుపత్రికి ఏడుగురు అనుమానితులు
ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిలో శనివారం ఏడుగురు కరోనా అనుమానితులు పరీక్షల కోసం చేరారు. ప్రస్తుతం మొత్తం 50 మంది ఛాతీ ఆసుపత్రిలో ఉన్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్‌ఖాన్ చెప్పారు. కరోనా అనుమానిత లక్షణాలతో ఉన్నవారు స్వయంగా ఛాతీ ఆసుపత్రికి వచ్చి ఉచితంగా పరీక్షలు చేయించుకోవచ్చని, అవసరమైన వారికి చికిత్స అందిస్తామని తెలిపారు.