తెలంగాణ

telangana

ETV Bharat / state

దిల్లీ మద్యం కేసు.. శరత్‌ చంద్రారెడ్డి, బినోయ్‌ బాబులకు 14 రోజుల కస్టడీ - Delhi Liquor Scam

Delhi Liquor Scam Case Updates: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరబిందో గ్రూప్ డైరెక్టర్ పెనక శరత్ చంద్రారెడ్డి, పెర్నాడో రికార్డ్ కంపెనీ ప్రతినిధి బినోయ్ బాబులకు రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబుల బెయిల్ పిటిషన్లను ఇదే కేసులో నిందితులుగా ఉన్న బోయినపల్లి అభిషేక్, విజయ్ నాయర్ల పిటిషన్లతో కలిపి ఈ నెల 24న విచారించనున్నట్లు ప్రత్యేక జడ్జి ప్రకటించారు. కోర్టు ప్రాంగణంలో శరత్​ చంద్రారెడ్డిని వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్​రెడ్డి పరామర్శించారు.

Delhi Liquor Scam
Delhi Liquor Scam

By

Published : Nov 22, 2022, 6:42 AM IST

Delhi Liquor Scam Case Updates: దిల్లీ మద్యం కుంభకోణంలో అరబిందో గ్రూప్​ డైరెక్టర్​ పెనక శరత్​ చంద్రారెడ్డి, పెర్నాడో రికార్డ్​ కంపెనీ ప్రతినిధి బినోయ్​ బాబుల ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో ఎన్ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ అధికారులు రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచగా.. కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్​ చట్టం కింద శరత్, బినోయ్​ బాబులను ఈ నెల 10న ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ దిల్లీలో అరెస్టు చేసింది. విచారణకు సహకరించకపోవడంతో అరెస్టు చేసినట్లు ప్రత్యేక న్యాయస్థానానికి తెలియజేసి కస్టడీకి తీసుకుంది. తొలుత ఏడు రోజులు, తర్వాత మరో నాలుగు రోజులు కస్టడీకి తీసుకున్న ఈడీ.. అది ముగియడంతో శరత్​ చంద్రారెడ్డి, బినోయ్​ బాబులను న్యాయస్థానంలో హాజరుపరిచింది. దర్యాప్తు కొనసాగుతోందని, మిగిలిన వారిని ప్రశ్నిస్తున్నట్లు తెలిపింది. నిందితులను ఇప్పుడే విడుదల చేయకుండా జ్యుడీషియల్​ రిమాండ్​కు పంపాలన్న ఈడీ విజ్ఞప్తిని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అంగీకరించారు.

Delhi Liquor Scam Case : అనారోగ్యం కారణంగా ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని నిందితుల తరఫు న్యాయవాదులు ప్రత్యేక న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. ఇలాంటి కేసుల్లో ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించలేమని ప్రత్యేక జడ్జి తెలుపగా.. శరత్ చంద్రారెడ్డి తీవ్రమైన వెన్నునొప్పి, బీపీతో బాధపడుతున్నారని, ఇందుకు సంబంధించి రామ్​మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్సకు సంబంధించిన పత్రాలను న్యాయవాదులు న్యాయస్థానానికి అప్పగించారు. జైలులో ఉన్ని దుస్తులు, ఇంటి భోజనానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బినోయ్ బాబుకు తీవ్రమైన అజీర్తి సమస్య ఉందని, ఇంటి భోజనానికి అనుమతి ఇవ్వాలని కోరారు. చిగుళ్ల సమస్య వల్ల నీటిని ఉంచుకునేందుకు ప్రత్యేక ఫ్లాస్క్, ప్రత్యేక పడకకు అనుమతి ఇవ్వాలని న్యాయవాదులు కోరారు. నిందితులు ఇరువురికి ఇంటి భోజనం, రెండు జతల ఉన్ని దుస్తులు, జైలు నిబంధనల ప్రకారం వినియోగించుకోవడానికి పాదరక్షలు తెచ్చుకునేందుకు ప్రత్యేక జడ్జి అవకాశం కల్పించారు. ప్రత్యేక పడకను ఏర్పాటుకు చేసుకోవడం సాధ్యపడదని తేల్చి చెప్పారు. ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే జైలు ఆసుపత్రిలో చూపించాలని, అక్కడి వైద్యుని సలహా మేరకు తగిన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు.

ఈ నెల 24న విచారణ..: నిందితులిద్దరికి డిసెంబరు ఐదో తేదీ వరకు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబుల బెయిల్ పిటిషన్లను ఇదే కేసులో నిందితులుగా ఉన్న బోయినపల్లి అభిషేక్, విజయ్ నాయర్ల పిటిషన్లతో కలిపి ఈ నెల 24న విచారించనున్నట్లు ప్రత్యేక జడ్జి ప్రకటించారు. ప్రత్యేక కోర్టు లిఖిత పూర్వక ఉత్తర్వులు వెలువరించిన వెంటనే.. ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ నుంచి నిందితులను నేరుగా తిహాడ్​ జైలుకు తరలించారు.

ఎమ్మెల్యే చెవిరెడ్డి మంతనాలు..: శరత్​ చంద్రారెడ్డిని వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్​రెడ్డి దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో కలిశారు. జ్యుడీషియల్​ రిమాండ్​ విధించిన తర్వాత న్యాయమూర్తి లిఖిత పూర్వక ఆదేశాల కోసం వేచి చూస్తున్న సమయంలో వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్​రెడ్డి పెనక శరత్ చంద్రారెడ్డిని కలిశారు. నిందితులు ఇద్దరినీ జైలుకు తరలిస్తున్న సమయంలో లిఫ్ట్​లో, కోర్టు సెల్లార్​ పార్కింగ్​ ప్రదేశంలో వాహనాల్లో ఎక్కించే వరకు చెవిరెడ్డి శరత్ చంద్రారెడ్డితో మంతనాలు జరిపారు.

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details