ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి (YSR) మరణించి పుష్కర కాలం అయిన సందర్భంగా ఆయన వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్ఆర్ సతీమణి వైఎస్ విజయలక్ష్మి ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఆనాటి వైఎస్ఆర్ మంత్రివర్గ సభ్యులు, సహచర నాయకులు, సన్నిహితులు తదితరులతో ఇవాళ హైదరాబాద్ శివారు మాదాపూర్ హెచ్‌ఐసీసీలోని నోవాటెల్‌లో ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వైఎస్‌ఆర్ సన్నిహితులను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు.
ఇరు రాష్ట్రాల్లోని కాంగ్రెస్, తెరాస తదితర పార్టీల్లో ప్రస్తుతం వివిధ పదవుల్లో ఉన్న వారిని ఈ సమావేశానికి ఆహ్వానించినట్లు సమాచారం. వైఎస్ఆర్‌కు అప్పట్లో సన్నిహితంగా ఉన్న నేతలతో పాటుగా అధికారులనూ ఈ కార్యక్రమానికి విజయలక్ష్మి స్వయంగా ఆహ్వానిస్తున్నట్లు ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఏపీకి చెందిన కేవీపీ రాంచందర్‌రావు, ఉండవల్లి అరుణ్‌కుమార్ తదితర నాయకులను, తెలంగాణలో తెరాస ఎంపీలుగా ఉన్న డి. శ్రీనివాస్, కె. కేశవరావు, సురేశ్‌రెడ్డి, మంత్రి సబితాఇంద్రారెడ్డి, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి సోదరులు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఇతర సీనియర్ నాయకులను వైఎస్ వర్ధంతి కార్యక్రమానికి ఆహ్వానించినట్లు చెబుతున్నారు.