తెలంగాణ

telangana

ETV Bharat / state

Ramanuja Statue: 120 ఏళ్ల పరిపూర్ణ జీవనానికి ప్రతీక 120 కిలోల సువర్ణ విగ్రహం - 120 kgs golden statue of ramanujacharya

Ramanuja Statue: భగవద్రామానుజుల 120 సంవత్సరాల పరిపూర్ణ జీవనానికి ప్రతీకగా 120 కిలోల బంగారంతో రూపొందించిన యతీంద్రుని విగ్రహం భక్తులకు దర్శనమిచ్చేందకు సిద్ధమైంది. ఇవాళ రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ ఈ విగ్రహన్ని ఆవిష్కరించనున్నారు.

Ramanuja
Ramanuja

By

Published : Feb 13, 2022, 7:24 AM IST

Ramanuja Statue: 120 సంవత్సరాల పరిపూర్ణ జీవనం.. విశిష్టాద్వైత సిద్ధాంత వ్యాప్తికి, సర్వమానవ సమానత్వ సూత్ర ప్రబోధానికి అంకితం చేసిన మహనీయులు భగవద్రామానుజులు. అందుకు ప్రతీకగా 120 కిలోల బంగారంతో రూపొందించిన ఆ యతీంద్రుని విగ్రహం భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధమైంది. నిత్యారాధనలు అందుకోబోయే ఈ సువర్ణమూర్తిని ఈరోజు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆవిష్కరించనున్నారు. సమతామూర్తి కేంద్రంలోని భద్రవేది మొదటి అంతస్తులో 54 అడుగుల ఎత్తున దీన్ని కొలువుదీర్చారు.

ధనిక..పేద.. అందరి భాగస్వామ్యం...

బంగారు విగ్రహం కొలువుదీరిన అంతస్తును ప్రసన్న శరణాగత మండపంగా పిలుస్తారు. విగ్రహాన్ని పూర్తిగా ముచ్చింతల్‌లోని ‘జీవా’ ఆశ్రమంలోనే తయారు చేశారు. మైహోం గ్రూపు అధినేత జూపల్లి రామేశ్వర్‌రావు 27 కిలోల బంగారం విరాళమిచ్చారు. అమెరికాకు చెందిన మరో భక్తురాలు 8 కిలోలు అందించారు. ఆశ్రమంలో పనిచేసే కార్మికులు సైతం తమ వంతుగా అరగ్రాముు, గ్రాము చొప్పున బంగారం ఇచ్చారు. ఇలా పేదా గొప్పా తేడా లేకుండా ఎందరో భక్తులిచ్చిన విరాళాలతో 54 అంగుళాల సువర్ణ ప్రతిమను రూపొందించారు. విగ్రహం వెనుక ఉండే మకరతోరణాన్ని (ప్రభావరి) వెండితో తయారు చేయించారు.

ఎన్నో ప్రత్యేకతలు...

*సాధారణంగా రామానుజుల విగ్రహం ముందు శఠారిని ముదలియాండాన్‌గా పిలుస్తారు. తిరుమలలోని రామానుజుల మందిరంలో అనంతాళ్వాన్‌ అని వ్యవహరిస్తారు. ఈ రెండు పేర్లు ఇద్దరు భక్తులకు ప్రతీకలు. సమతామూర్తి కేంద్రంలోని సువర్ణమూర్తి వద్ద ఉండే శఠారిలో ముదలియాండాన్‌, అనంతాళ్వాన్‌ ప్రతిమలను కలిపి రూపొందించారు.
*బంగారు మూర్తిని ప్రతిష్ఠించిన వేదికను భద్రపాదంగా పిలుస్తారు. 36 అంగుళాల ఎత్తులో పూర్తిగా కృష్ణశిలతో శాస్త్రోక్తంగా ఈ వేదికను నిర్మించారు. మండపంలోని అన్ని స్తంభాలు రామానుజాచార్యుల చుట్టూ నక్షత్రాకృతిలో ఉంటాయి.
*భద్రవేదిలోని బ్రహ్మస్థానంలో సువర్ణమూర్తిని ఏర్పాటు చేశారు. దీనివల్ల మూడువైపుల నుంచి చూస్తే వేర్వేరు అందమైన ఆకృతుల్లో రామానుజులు దర్శనమిస్తారు.
*అత్యాధునిక సాంకేతికతను వినియోగించి భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. 360 డిగ్రీల కోణంలో చూపించే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
*మండపంలో రెండువేల మంది కూర్చొనే వీలుంది. 48 స్తంభాలపైన 32 బ్రహ్మవిద్యల శిల్పాలు కనువిందు చేస్తుంటాయి.
*విగ్రహంపై పడేలా పంచవర్ణాలతో దీపాలు అమర్చారు.
*బంగారు విగ్రహం కావడంతో కేవలం శుద్ధ జలాన్ని వినియోగించి అభిషేకం చేస్తారు. పంచామృతాభిషేకం ఏడాదిలో పరిమితంగానే నిర్వహిస్తారు. విగ్రహంపై ఉన్న త్రిదండం, తులసిమాలలను తీసి తిరిగి అమర్చే వీలుంటుంది.

ఇదీ చూడండి:నేడు సమతామూర్తి కేంద్రానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

ABOUT THE AUTHOR

...view details