మృతుల్లో వైద్య విద్యార్థి,ఇద్దరు చిన్నారులు
ఏపీలోని విశాఖపట్నం ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో గాలే గరళమైంది. ఈ విషవాయువు పీల్చి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు పోలీసులు గురువారం రాత్రి అధికారికంగా మృతుల వివరాలను ప్రకటించారు. మృతుల్లో ఓ వైద్య విద్యార్థి, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
కల తీరకుండానే..
గోపాలపట్నం పోలీసు స్టేషన్‌పరిధిలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఈశ్వరరావు కుమారుడు చంద్రమౌళి ఆంధ్ర వైద్యకళాశాలలో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలనే లక్ష్యంతో చంద్రమౌళి కష్టపడి చదివి మెరిట్‌లో ఎంబీబీఎస్ సీటు సంపాదించుకున్నారు. ఈ ఏడాదే వైద్యకోర్సులో చేరారు. గురువారం ఉదయం విషవాయు దుర్ఘటనలో మృత్యువాత పడటం విషాదం.
మృతులు
అప్పలనర్సమ్మ(45), కుందన శ్రియ(6), ఎ.చంద్రమౌళి(19, వైద్యవిద్యార్థి), సిహెచ్.గంగరాజు(48), బి.నారాయణమ్మ(35), ఎన్.గ్రీష్మ(9), మేకా కృష్ణమూర్తి(72), పి.వరలక్ష్మి(38), ఎన్.నాని(40), పి.శంకర్రావు(40), వి.నూకరాజు(60) మృతి చెందారు. వీరంతా గోపాలపట్నం, ఆర్‌ఆర్ వెంకటాపురానికి చెందిన వారని విశాఖ నగర పోలీసు కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు. 11 మందిలో చంద్రమౌళి మృతదేహానికి మాత్రమే శవపరీక్ష జరిగింది. మిగిలిన మృతదేహాలకు శవపంచనామా పూర్తి చేశారు. శుక్రవారం పరీక్షలు చేయనున్నారు. 12వ వ్యక్తి గంగాధర చౌదరి కొత్తవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో చనిపోయారు. అతనితో కలిపి 12 మంది మృతి చెందినట్లు వెల్లడించారు.