అడుగడుగునా తనిఖీలు.. రాష్ట్రంలో కఠినంగా లాక్‌డౌన్ అమలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో.... పోలీసులు లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో సీపీ సజ్జనార్ పర్యటించారు. జగద్గిరిగుట్ట, చింతల్, షాపూర్‌నగర్, ఆల్విన్ కాలనీ ప్రాంతాల్లోని గల్లీలు చుట్టేశారు. సడలింపు సమయం తర్వాత తెరిచి ఉంచిన దుకాణాలను మూసివేయించారు. కూకట్‌పల్లిలోనూ ముమ్మర తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాలని సజ్జనార్ సిబ్బందిని ఆదేశించారు.
చెక్ పోస్టులు పరిశీలించిన సీపీ
హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్ చెక్ పోస్టులను రాచకొండ సీపీ మహేష్ భగవత్ పరిశీలించారు. ప్రభుత్వ ఆదేశాలు ఎవరూ పాటించకపోయినా... ఉపేక్షించబోమని హెచ్చరించారు. పంతంగి టోల్‌గేట్ వద్ద పోలీసు సిబ్బందికి... మహేశ్‌భగవత్ స్నాక్స్, శానిటైజర్లు అందించారు. విధి నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రాచకొండ పరిధిలో లాక్‌డౌన్ ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై... 35 వేల కేసులు నమోదు చేసినట్లు మహేశ్‌భగవత్ తెలిపారు. హైదరాబాద్‌లోని బేగంబజార్‌లో సడలింపు సమయం ముగిసినా.... పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవటంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ఖమ్మం జిల్లాలో ఐజీ నాగిరెడ్డి పర్యటన
జిల్లాల్లోనూ లాక్‌డౌన్ మరింత కఠినతరం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐజీ నాగిరెడ్డి పర్యటించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చెక్‌పోస్టులను తనిఖీ చేశారు. లాక్‌డౌన్ అమలు తీరుపై ఆరా తీశారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. వరంగల్‌లోని అన్ని కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. వాహనాలు నిలిపి ఈపాసులు చూపించిన వారినే పంపించారు. మహబూబాబాద్‌లో అనవసరంగా బయటకు వచ్చిన వారి వాహనాలు జప్తు చేశారు. 10 తర్వాత తెరిచి ఉంచిన దుకాణాలు మూసివేశారు.
దుకాణాలు తెరిచిన 9మందిపై చర్యలు
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర తెలిపారు. ఇప్పటివరకు 908మందిపై కేసులు నమోదు చేశామని వెల్లడించారు. సమయం ముగిసినా దుకాణాలు తెరిచిన 9మందిపై చర్యలు తీసుకున్నామన్నారు. జగిత్యాల జిల్లాలో శనివారం ఒక్క రోజే 158 వాహనాలు సీజ్ చేయగా.. 3,500 కేసులు పెట్టామని పోలీసులు తెలిపారు. సరుకు రవాణాపై ఆంక్షలు విధిస్తున్నట్లు ఏస్పీ వివరించారు. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌లో లాక్‌డౌన్ అమలును ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షించారు. ప్రధాన కూడళ్లలో పోలీసు పికెటింగ్‌ను తనిఖీ చేశారు.
ఇదీ చదవండి:అతివేగంగా వచ్చి.. కారును ఢీకొట్టి..!