రైతుబంధు పథకం పదో విడతలో భాగంగా నేడు రూ.426.69 కోట్ల నిధులు విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. లక్ష 87 వేల 847 మంది రైతులకు నిధులు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి తెలిపారు. నేడు 8 లక్షల 53 వేల 409.25 ఎకరాలకు నిధులు విడుదలయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు మొత్తం 56 లక్షల 58 వేల 484 మంది రైతుల ఖాతాల్లో రూ.4,754.64 కోట్లు జమ చేసినట్లు మంత్రి వివరించారు.
ప్రతి రైతుకు రైతుబంధు పదో విడత సాయాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. వ్యవసాయం లాభసాటి కావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షగా పేర్కొన్నారు. కరోనా ఇబ్బందులున్నా రైతుబంధు నిధులు పంపిణీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని తెలిపారు. ప్రతి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 100 శాతం కొనుగోళ్లు చేపట్టిన ఘనత కేసీఆర్‌దేనని పేర్కొన్నారు.