క్షణాల్లో చేరుతాయ్.. ప్రాణాలు నిలుపుతాయ్! - అంబులెన్స్ తాజా వార్తలు
భాగ్యనగరం చుట్టూ ఉన్న బాహ్య వలయ రహదారి(ఓఆర్‌ఆర్)పై తరచూ ఎక్కడోచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఘటనల్లో అనేకమంది క్షతగాత్రులవుతున్నారు. గాయాలతో నిస్సహాయ స్థితిలో ఉన్న వాహనదారులకు తక్షణమే వైద్యసేవలందేలా హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) చర్యలు చేపట్టింది. అధునాతన సౌకర్యాలతో కూడిన 10 అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్‌లను వచ్చే వారంలో ప్రారంభించనుంది. అలానే 10 టోల్ ప్లాజాల వద్ద ట్రామా కేంద్రాలు నవంబరు మొదటివారంలో అందుబాటులోకి రానున్నాయి.
క్షణాల్లో చేరుతాయ్.. ప్రాణాలు నిలుపుతాయ్...!
By
Published : Oct 8, 2020, 8:45 AM IST
ఓఆర్‌ఆర్‌పై మితిమీరిన వేగంతో దూసుకెళ్తూ ఒక్కసారిగా వాహనాలను నిలుపుదల చేసే ప్రయత్నంలో ముందు వెళ్తున్న లేదా ఆగి ఉన్న వాహనాలను ఢీకొడుతున్నారు. కొన్ని వాహనాలైతే ఏకంగా గాల్లోకి ఎగిరి బోల్తా కొడుతున్నాయి. 75 శాతం ప్రమాదాలు అతివేగం వల్లనే జరిగాయని సైబరాబాద్, రాచకొండ పోలీసుల అధ్యయనంలో వెల్లడైంది. లేన్ క్రమశిక్షణ పాటించకపోవడమూ మరో కారణం. అయితే.. ఘటనాస్థలానికి అంబులెన్స్ చేరుకుని, అక్కడి నుంచి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి చేర్చేసరికి తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇకపై ఆ పరిస్థితులు తప్పనున్నాయి.
టోల్ ప్లాజా భవనాల్లో...
ప్రతి ఇంటర్‌ఛేంజ్ దగ్గర విశాలమైన టోల్ ప్లాజా పరిపాలనా భవనాలుంటాయి. వాటిలోనే ట్రామా కేంద్రాలను అందుబాటులోకి తెస్తారు. ఇప్పటికే శంషాబాద్, పోలీస్ అకాడమీ, కోకాపేట్, దుండిగల్, శామీర్‌పేట్, పటాన్‌చెరు, ఘట్‌కేసర్, పెద్దఅంబర్‌పేట్, బొంగళూరు, తుక్కుగూడ ఇంటర్‌ఛేంజ్‌ల వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. నిపుణులైన సిబ్బంది నిత్యం ఉంటారు. అత్యవసరమైతే తప్ప మిగిలిన సందర్భాల్లో ఇక్కడే వైద్య సహాయం అందిస్తారు. వైద్య పరికరాలను కొనుగోలు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
ప్రతి 10 కి.మీ.కు ఒకటి
ఓఆర్‌ఆర్‌పై ఉన్న ఇంటర్‌ఛేంజ్‌ల వద్ద మాత్రమే వాహనాలు పైకి ఎక్కి, దిగేలా ర్యాంప్‌లున్నాయి.
కనీసం ప్రతి 10 కి.మీలకు ఒక అంబులెన్స్ ఉంచుతారు.
తొలిదశలో నిత్యం ప్రమాదాలు జరిగే బ్లాక్‌స్పాట్స్‌కు సమీపంలో 10 వాహనాలు ఉంటాయి.
వీటిలో అత్యాధునిక సౌకర్యాలతో పాటు తర్ఫీదు పొందిన సిబ్బంది ఉంటారు. ప్రాథమిక వైద్యం అందించి దగ్గర్లోని ట్రామా సెంటర్‌కు లేదా ఆసుపత్రికి తరలిస్తారు.
అంబులెన్స్‌ల నిర్వహణకు ఏటా రూ.2.2 కోట్లు వెచ్చిస్తారు. ఆ తర్వాత దశలవారీగా మరిన్ని వాహనాలు అందుబాటులోకి తెస్తారు.