రాష్ట్రంలో కరోనా మహమ్మారి కారణంగా మరో ఆరుగురు మృతిచెందారు. మొత్తం మృతుల సంఖ్య 105కు పెరిగింది. గురువారం మరో 127 మందికి వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రవాసుల్లో నమోదైన కేసుల సంఖ్య 2,699కు చేరుకుంది. తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీ (హైదరాబాద్) పరిధిలోనే అత్యధికంగా 110 నమోదవగా, ఆదిలాబాద్‌లో 7, రంగారెడ్డిలో 6, మేడ్చల్‌లో 2, సంగారెడ్డిలో 1, ఖమ్మంలో 1 చొప్పున నిర్ధారణ అయ్యాయి. ఇప్పటి వరకూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు, అంతర్జాతీయ ప్రయాణికులు 448 మందిలో కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 1,455 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా 31 మంది కొవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మొత్తంగా కరోనా బారినపడి ఆరోగ్యవంతులుగా ఇళ్లకెళ్లినవారి సంఖ్య 1,587కు చేరింది. గురువారం నమోదైన కేసులతో కలుపుకుంటే.. రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,147కు పెరిగింది.
ఉద్ధృతిని ఎదుర్కోవడమెలా?
రానున్న రోజుల్లో కరోనా కేసుల సంఖ్య పెరిగితే.. ఆ ఉద్ధృతిని ఎదుర్కోవడమెలా అనే అంశంపై వైద్యఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది. జులై నెలాఖరు నాటికి కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగే అవకాశాలున్నాయనే అంచనాలు వ్యక్తమవుతున్నందున.. ఆ మేరకు చికిత్సకు సౌకర్యాలు కల్పించడంపై దృష్టిపెట్టింది. మృతుల సంఖ్యను తగ్గించడానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులను, చికిత్సలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఈ విషయంపై వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. పడకల సంఖ్యను ఎలా పెంచుకోవాలి? ఎక్కడెక్కడ వసతులు సమకూర్చాలి? అనేవి ప్రధానాంశాలుగా మారతాయనే అభిప్రాయం వ్యక్తమైంది. అదనంగా వైద్యులు, నర్సులు, ఇతర మానవ వనరుల నియామకం అంశం కూడా చర్చకొచ్చింది. ఈ నెలాఖరులోగా అవసరాల మేరకు ఒప్పంద ప్రాతిపదికన నియామకాల ప్రక్రియను పూర్తిచేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.