అక్రమార్జనే లక్ష్యంగా....మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న ముఠాలను డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి ముంబైకి ఓ ప్రైవేటు బస్సులో మత్తు మందులు రవాణా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు ముఠా గుట్టు రట్టు చేశారు. హైదరాబాదు, ముంబయిలో మూడు రోజులపాటు విస్తృతంగా సోదాలు నిర్వహించి భారీగా నిషేధిత మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.
రూ.97 కోట్ల సరుకు పట్టివేత
నగర శివారు ప్రాంతంలోని జిన్నారం మండలంలో మూసివేసిన ఓ ఫార్మా పరిశ్రమలో మత్తు మందులను తయారు చేస్తున్నట్లు గుర్తించి దాడులు చేశారు. విదేశాలకు, దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్న మెఫెడ్రొన్, కెటామైన్‌లతోపాటు మరికొన్ని నమూనాలను స్వాధీనం చేసుకున్నారు. 47 కోట్ల విలువైన 210 కిలోలు మెఫెడ్రోన్, 10కిలోలు కెటామైన్, 31కిలోలు ఎపిడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు. 50 కోట్ల విలువైన మెఫెడ్రోన్ మాదకద్రవ్యాలు తయారు చేసేందుకు సిద్దంగా ఉన్న ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు.