తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్తగా 10 పారిశ్రామిక పార్కులు.. రూ.6,023 కోట్ల పెట్టుబడులు - హైదరాబాద్​ తాజా వార్తలు

రాష్ట్రంలో మరో పది పారిశ్రామిక పార్కులు ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన వీటి అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. రూ.6,023 కోట్ల పెట్టుబడులతో 453 పరిశ్రమల స్థాపనకు ప్రతిపాదనలు వచ్చాయి. వీటి ద్వారా 7,623 మందికి ఉపాధి కలగనుంది.

10 new industrial parks
రాష్ట్రంలో కొత్తగా 10 పారిశ్రామిక పార్కులు

By

Published : Jun 16, 2021, 7:44 AM IST

రాష్ట్రంలో కొత్తగా చేపట్టిన పది పారిశ్రామిక పార్కుల్లో అయిదు పారిశ్రామిక సంబంధ పార్కులు కాగా రెండు వ్యవసాయోత్పత్తుల శుద్ధి (ఆగ్రో) పార్కులు, విద్యుత్‌ వాహనాల పార్కు, ఐటీ పార్కు, ఆక్వా పార్కు ఒకటి చొప్పున ఉన్నాయి. వాటిలో సిద్దిపేట జిల్లాలోని మందపల్లి, తునికిబొల్లారం, సంగారెడ్డి జిల్లా జిన్నారంలో పారిశ్రామిక పార్కులు, యాదాద్రి జిల్లా రాయరావుపేటలో సూక్ష్మ పరిశ్రమల పార్కు, సంగారెడ్డి జిల్లా ఉస్మాన్‌నగర్‌లో ఐటీ పార్కు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆక్వా పార్కు, యాదాద్రి జిల్లా దండు మల్కాపూర్‌లో ఆగ్రో పార్కు, సిద్దిపేట జిల్లా బండమైలారంలో ఆగ్రో పార్కు, మహబూబ్‌నగర్‌ జిల్లా దివిటిపల్లిలో విద్యుత్‌ వాహనాలు, ఇంధన నిల్వ కోసం న్యూ ఎనర్జీ పార్కులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.

ఆక్వా రంగంలో తొలి పార్కు...

వ్యవసాయాధారిత పంట ఉత్పత్తులతో ఆగ్రో పరిశ్రమను పెద్దఎత్తున ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 500 ఎకరాలతో ఆగ్రో పార్కులను ఏర్పాటు చేస్తోంది. కాళేశ్వరం నీటితో చెరువులు, కుంటలకు పుష్కలంగా నీరు రావడంతో దాని ఆధారంగా సిరిసిల్ల జిల్లాలో ఆక్వాపార్కును ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఆక్వా రంగంలో ఇదే తొలి పారిశ్రామిక పార్కు కానుంది.

3900 ఎకరాల కేటాయింపు...

ఈ పది పార్కులకు మొత్తంగా 3900 ఎకరాల భూమిని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) కేటాయించింది. వీటిలో రూ.6023 కోట్ల పెట్టుబడులతో 453 పరిశ్రమల స్థాపనకు ప్రతిపాదనలు వచ్చాయి. వీటి ద్వారా 7623 మందికి ఉపాధి కలగనుంది.

దశల వారిగా ప్రారంభోత్సవాలు...

ఈ పార్కు స్థలాల్లో ఇప్పటికే రోడ్లు, విద్యుత్‌, నీటిసరఫరా, మురుగునీటి పారుదల పనులు జరిగాయి. పరిశ్రమల భవన నిర్మాణాలు సాగుతున్నాయి. వీటిని దశల వారిగా ఒకటి, రెండు నెలల్లో ప్రారంభించనున్నారు. కొన్ని పార్కుల్లో నేరుగా పరిశ్రమలకు శంకుస్థాపనలు జరగనున్నాయి. దివిటిపల్లిలో త్వరలో మంత్రి కేటీఆర్‌, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌లు పరిశ్రమలకు భూమి పూజ చేయనున్నారు.

ఇదీ చదవండి: నవ్వులు పూయిస్తున్న ఏటీఎం దొంగల తతంగం.. ఏం చేశారంటే..!

ABOUT THE AUTHOR

...view details