స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో పలువురిని మోసం చేసిన కేసులో సీసీస్, సైబర్ క్రైం పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. మహారాష్ట్రకు చెందిన ఫియాజ్ మొహమ్మద్ అన్సారీ, హమీద్, మొహమ్మద్ జహంగీర్లు అన్సారీ క్యాపిటల్ సొల్యూషన్, అన్సారీ పెర్ఫ్యూమ్స్ అండ్ కాస్మొటిక్స్ పేరుతో స్టాక్ ఎక్చెంజ్ సంస్థలను స్థాపించారు. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయంటూ ప్రజలను నమ్మించారు.
మహారాష్ట్ర బివండిలో అరెస్టు:
హైదరాబాద్ చాంద్రాయణగుట్టకు చెందిన మొహమ్మద్ జీలనీ షరీఫ్ వారి సంస్థలో లక్షల్లో పెట్టుబడి పెట్టాడు. ఆ డబ్బుకు సంబంధించి ఎటువంటి లావాదేవీలు జరగకపోవడం, వారి నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడం వల్ల మోసపోయానని గ్రహించిన జీలనీ గతేడాది సెప్టెంబర్‌లో సీసీస్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏడాది కాలంగా తప్పించుకు తిరుగుతున్న ఫియాజ్, హమీద్‌లను ఆదివారం మహారాష్ట్రలోని బివండిలో అదుపులోకి తీసుకున్నారు.