Driver Absconded with 1.2 Crore Cash in Hyderabad : హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇటీవల రూ.7 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో డ్రైవర్ పరారైన ఘటన మరవక ముందే రూ.1.2 కోట్ల నగదుతో ఓ వాహన చోదకుడు (డ్రైవర్) పరారైన ఘటన జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు 'ఘరానా డ్రైవర్' కోసం గాలింపు మొదలుపెట్టారు.
కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కల్లూరుకు చెందిన బానోతు సాయి కుమార్ మాదాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని ఆదిత్రి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో మూడేళ్లుగా డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. నమ్మకంగా ఉంటుండటంతో అతడితో ఆర్థిక కార్యకలాపాలూ చేయించుకునేవారు. అతడూ వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇన్ని రోజులుగా పని చేస్తూ వచ్చాడు. అయితే.. పెద్ద మొత్తంలో డబ్బు చూస్తుండటంతో అతడి మదిలో పాడు ఆలోచన మొదలైంది. అంతే.. పథకం రచించి సమయం కోసం వేచి చూస్తున్నాడు.
Driver Absconded with 1.2 Crore Cash in Jubilee Hills :ఈ క్రమంలోనే ఈ నెల 24న ఉదయం సంస్థ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రావు రూ.1.2 కోట్లను జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఇవ్వాల్సిందిగా డ్రైవర్ బానోతు సాయి కుమార్‌కు సూచించారు. దాంతో సాయి కుమార్ సంస్థ వాహనం ఇన్నోవా (TS 08 HP 9788)లో శ్రీనివాస్‌రావు ఇచ్చిన డబ్బుతో ఆఫీస్ నుంచి బయలుదేరాడు. తన ప్లాన్ అమలు చేయడానికి ఇదే సరైన సమయం అని భావించి.. డబ్బుతో పరారయ్యేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్‌లోని కళాంజలి సమీపంలోకి వెళ్లగానే కారును అక్కడే వదిలేసి డబ్బుతో పరారయ్యాడు.