మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాను ఐదున్నర గంటలపాటు ప్రశ్నించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ). ఫిబ్రవరి 6న ఈడీ విచారణకు హాజరు కావాలని దిల్లీ కోర్టు ఆదేశాలిచ్చింది. వాద్రా విచారణకు హాజరవడం ఇదే తొలిసారి.
నగదు లావాదేవీలు, స్థిరాస్తి అమ్మకాలు, కొనుగోలుపై డజనుకుపైగా ప్రశ్నలను ఎన్ఫోర్స్మెంట్ సంధించింది. రాజకీయ పరంగా తన మీద ఆరోపణలు చేస్తున్నారని విచారణలో వాద్రా తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని స్పష్టం చేశారు.
"వాద్రాపై ఉన్న ఆరోపణలన్నీ ఆసత్యాలు. మేం ఈడీకి వందశాతం సహకరిస్తాం. ఎప్పుడు పిలిచినా వాద్రా హాజరవుతారు."
-సుమన్ జ్యోతి కేతన్, వాద్రా తరఫు న్యాయవాది.
కోర్టు ఆదేశాల మేరకు జామ్‌నగర్‌లోని ఈడీ కార్యాలయానికి వాద్రా.. ఆయన భార్య ప్రియాంక గాంధీ కలిసి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత ప్రియాంక అక్కడనుంచి వెళ్లిపోయి తూర్పు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శిగా బాధ్యతలను స్వీకరించారు.