హిందువులు జరుపుకునే పండుగల్లో ఉగాది ప్రముఖమైనది. ఉగాది.. అచ్చమైన ప్రకృతి పండగ. ఇవాళ్టి నుంచే తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభం. ఇది తెలుగువారి మొదటి పండగ అయింది. చైత్ర శుద్ధ పాఢ్యమినే ఉగాదిగా చెబుతారు.
ముఖ్యంగా తెలుగురాష్ట్రాలు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఉగాదిగా పరిగణిస్తే... మహారాష్ట్రలో గుడిపాడ్వా పేరుతో పిలుస్తారు. తమిళులు పుత్తాండు, మలయాళీలు విషు, సిక్కులు వైశాఖీ, బెంగాలీలు పొయ్లా బైశాఖ్ పేర్లతో పండుగను జరుపుకుంటారు. అయితేనేం ఏ పేరుతో పిలిచిన పండుగ నిర్వహణలో పెద్దగా తేడాలు ఉండవు.
తెలుగు రాష్ట్రాల్లో ఉగాది రోజున పంచాంగ శ్రవణం సంప్రదాయంగా వస్తుంది. ఆ సంవత్సరంలోని మంచి చెడులను, వ్యయ, ఆదాయ వివరాలు, ఆ ఏడాదిలో జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవటానికి ఆసక్తి చూపుతారు.