తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన పార్లమెంటు సభ్యులు అధినేత అధ్యక్షతన ప్రగతి భవన్లో సమవేశమయ్యారు. 9మంది లోక్‌సభ సభ్యులు, ఐదుగురు రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. ఈ నెల 17 నుంచి పార్లమెంటు సమావేశాలు ఉన్నందున... సభలో వ్యవహరించాల్సిన తీరుపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కేంద్రంతో తటస్థ వైఖరి అనుసరించాలని, ప్రత్యేకంగా శత్రుత్వం కానీ, మిత్రుత్వం కానీ ఉండొద్దని పేర్కొన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీ లేని పోరాటాలకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసారు. సమావేశాలకు ఎంపీలందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. వివిధ అంశాలపై చర్చల సందర్భంగా లోతైన అధ్యయనం చేయాలని ఎంపీలకు సూచించారు. ఈ సమావేశానికి ఆహ్వానం లేనందున డీ శ్రీనివాస్ హాజరు కాలేదని సమాచారం.
కేంద్రంతో తటస్థంగా ఉండాలి... అధినేత ఆదేశం
తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ సమావేశం అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగింది. లోక్‌సభ, రాజ్యసభ, పార్లమెంటరీ పార్టీ నేతలను ఎన్నుకున్నారు. కేంద్రంలో తటస్థ వైఖరి అవలంబించాలన్న సీఎం ... తెలంగాణ ప్రయోజనాలకోసం రాజీ లేని పోరాటం చేయాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
పార్టీ పక్షాన సభలో నేతలను, విప్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్లమెంటరీ పార్టీ నేతగా సీనియర్ ఎంపీ కే కేశవరావు మరోసారి ఎన్నికయ్యారు. రాజ్యసభలోనూ ఆయనే నాయకత్వం వహించనున్నారు. గత లోక్‌సభలో జితేందర్ రెడ్డి, ఉపనేతగా వినోద్ వ్యవహరించారు. వారిద్దరూ ప్రస్తుతం సభలో లేనందున కొత్త నాయకునిగా గతంలో తెలుగుదేశం పార్టీ పక్ష నేతగా వ్యవహరించిన నామ నాగేశ్వరావు వైపు అధిష్ఠానం మొగ్గు చూపింది. ఉపనేతగా కొత్త ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ ఉపనేతగా బండా ప్రకాశ్‌ను ఎన్నుకున్నారు. లోక్‌సభలో పార్టీ విప్‌గా బీబీ పాటిల్, రాజ్యసభలో సంతోష్ కుమార్ వ్యవహరించనున్నారు.
ఇవీ చూడండి: రేపు ముంబయి వెళ్లనున్న సీఎం కేసీఆర్