హైదరాబాద్ మాదాపూర్‌లో తెలుగుదేశం పార్టీకి ఐటీ సేవలందిస్తున్న ఐటీ గ్రిడ్స్ సాఫ్ట్ వేర్ కార్యాలయంపై సైబరాబాద్ పోలీసుల సోదాలు కలకలం రేపాయి. వైకాపా నేతల ఫిర్యాదు మేరకు ఐటీ గ్రిడ్స్‌లో అర్ధరాత్రి వరకు తనిఖీలు నిర్వహించిన పోలీసులు..కేసు నమోదు చేశారు. హార్డ్ డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకుని... ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలోనే అక్కడికి చేరుకున్న ఏపీ పోలీసులు... ఐటీ గ్రిడ్స్‌లో తనిఖీ చేసేందుకు అవకాశమివ్వాలని కోరారు. దీనికి మాదాపూర్ పోలీసులు నిరాకరించారు.
వైకాపా నేతల ఫిర్యాదు
నిబంధనలకు విరుద్ధంగా ఐటీ గ్రిడ్ సంస్థ... ఏపీ ప్రజల ఆధార్, ఓటర్, కులం, ప్రాంతం, ఇతర వివరాలు తెలిపే విధంగా తెదేపాకు మొబైల్ అప్లికేషన్ రూపొందించి ఇచ్చిందని వైకాపా ఫిర్యాదు చేసింది. సేవామిత్ర యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి ఆ వివరాలు అందుబాటులోకి వస్తాయని..వైకాపా నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఇదే ఐటీ సంస్థ కూకట్‌పల్లిలోని మరో సంస్థ నుంచి వివరాలు సేకరించిందంటూ మరో వైకాపా నేత తుమ్మల లోకేశ్వర్‌రెడ్డి సైబరాబాద్ పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం ఫేస్‌బుక్ అధికారిక పేజ్‌లో సేవామిత్ర వివరాలున్నాయని అందులో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి జనాభా వివరాలు, భౌగోళిక ప్రాంతాలు, ఆధార్ కార్డులు, ఏపీ స్మార్ట్‌పల్స్ సర్వే, స్టేట్ రెసిడెంట్ డేటా హబ్‌తో పాటు హైదరాబాద్‌లో ఉంటున్న కావ్య డేటా మేనేజ్‌మెంట్ సర్వీస్ నుంచి ప్రజా సాధికారవేదిక వివరాలు తీసుకుందని లోకేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఈ మొత్తం డేటాను ఐటీ గ్రిడ్స్ ఇండియా సంస్థ ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. 2012లో సుప్రీం జారీచేసిన ఆదేశాల ప్రకారం ఏ రాజకీయపార్టీ కూడా ఫొటోతో కూడిన ఓటర్ల జాబితాను ఉంచుకోరాదని..ఇందుకు విరుద్ధంగా తెలుగుదేశం వ్యవహరిస్తోందని లోకేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. వీటి సాయంతో 2014 ఓటరు జాబితాలో ఉన్న పేర్లను..2019 ఓటరు జాబితాలో తొలగించారని కోరారు.