మొదట్లో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పోరు...మూడు ప్రధాన పార్టీ అభ్యర్థుల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా కనబడింది. అధికార పార్టీ అభ్యర్థి తలసాని సాయి కిరణ్, భాజపా నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ తరఫున అంజన్ కుమార్ యాదవ్ పోటీలో ఉన్నారు. ఇక్కడ నెలకొన్న త్రిముఖ పోరులో గెలిచేదెవరో అన్నంత ఉత్కంఠ ఉండేది. కానీ పోలింగ్ దగ్గర పడుతుండగా... రోజురోజుకు పరిస్థితి మారినట్లు కనిపిస్తోంది. తెరాస, భాజపా ప్రచారంలో దూసుకుపోతుంటే... కాంగ్రెస్ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోతోంది.
తనయుని గెలుపు కోసం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శతవిధాల ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని ఆరుగురు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. కేటీఆర్ ప్రతిరోజు రోడ్‌షోలు చేస్తూ... శ్రేణుల్ని ఉత్సాహపరుస్తున్నారు. కిషన్ రెడ్డికి మద్దతుగా జాతీయ నాయకులు, ప్రచార తారలు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎక్కడ చూసినా... పోటీ తెరాస, భాజపా మధ్యే అన్నట్టు కనిపిస్తోంది.