తెలంగాణ

telangana

ETV Bharat / state

సార్వత్రిక సమరానికి సిద్ధం! - రాష్టాల శాసనసభ ఎన్నికలు

వచ్చే ఐదేళ్లు దేశ పాలన ఎవరి చేతుల్లో ఉంటుందో నిర్ణయించే సమయం రానేవచ్చింది. ఈ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ సాయంత్రం 5 గంటలకు ప్రజల ముంగిట ఉండబోతుంది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్​లో మరో ఎన్నికల సమరం మొదలుకాబోతోంది. దేశంలోని లోక్​సభ స్థానాలతోపాటు నాలుగు రాష్ట్రాల శాసనసభలకు పోలింగ్ జరగనుంది.

సాయంత్రం 5 గంటలకు ఎన్నికల షెడ్యూల్

By

Published : Mar 10, 2019, 11:27 AM IST

Updated : Mar 10, 2019, 11:45 AM IST

సార్వత్రిక ఎన్నికల సమరానికి రంగం సిద్ధమవుతోంది. వచ్చే ఐదేళ్లు దేశ పాలన ఎవరి చేతుల్లో ఉంటుందో నిర్ణయించే సమయం మరికొన్ని గంటల్లో ప్రజల ముంగిట ఉండబోతుంది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్​లో మరో ఎన్నికల సమరం మొదలుకాబోతోంది. పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం దాదాపు కసరత్తు పూర్తి చేసింది. పోల్ గంట మోగటమే తరువాయి ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది. ఇప్పటికే దేశంలోనే రాజకీయ పార్టీలు మాటల తూటాలు పేల్చుతున్నాయి. వచ్చేది మా ప్రభుత్వమే అంటూ సవాళ్లు విసురుకుంటున్నాయి.

మరికొన్ని గంటల్లో ప్రకటన..

ఎన్నికల ప్రక్రియను చేపట్టేందుకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే సిద్ధం చేసుకున్న ఈసీ...మరికొన్ని గంటల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే మే నెలలో 16 వ లోక్​సభ పదవీ కాలం ముగుస్తుంది. ఈలోపే ఎన్నికల నిర్వహణ పూర్తితో పాటు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉంటుంది. పుల్వామ ఘటన తర్వాత భారత్ -పాక్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణంతో దేశంలో నెలకొన్న సమస్యలతో కొంత ఆలస్యంగా జరుగుతాయని భావించినా..అనుకున్న కాల వ్యవధిలోనే పూర్తి చేస్తామని ఈసీ స్పష్టం చేసింది.

రాష్ట్రాల శాసనసభలకు....

దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లోక్​సభ స్థానాలకు ఎన్నికలతో పాటు...ఆంధ్రప్రదేశ్, అరుణాచల్​ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, కొంతకాలంగా గవర్నర్ పాలన కొనసాగుతున్న జమ్ముకశ్మీర్ శాసనసభ ఎన్నికలూ జరగనున్నాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని షెడ్యూల్ త్వరగా విడుదల చేస్తే సజావుగా పోలింగ్​ ప్రక్రియ నిర్వహించేందుకు అనువుగా ఉంటుందని ఎన్నికల సంఘం భావిస్తోంది.

క్షేత్రస్థాయి పర్యటనలు

రాష్ట్రాల్లోని క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందాలు పర్యటిస్తున్నాయి. ఎన్నికల నిర్వహణకు రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి...అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండటం వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. రాష్ట్రాల్లో సిద్ధం చేస్తున్న ఓటర్ల జాబితాపై ఈసీకి ఫిర్యాదులు అందుతున్నాయి. అలాంటి వాటికి అవకాశం ఇవ్వొద్దని...ఎట్టి పరిస్థితుల్లో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించవద్దని రాష్ట్ర ఎన్నికల అధికారులకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది.

పటిష్ట బందోబస్తు

వివిధ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు ఎన్నికల నిర్వహణపై సీఈసీకి నివేదికలు పంపారు. పోలింగ్​ ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన పారా మిలటరీ బలగాల తరలింపునకు ఏర్పాట్లు పూర్తి చేశామని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించింది. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టేందుకు ఈసీ సమాయత్తమవుతోంది. మొత్తం ఎన్నికల ప్రక్రియను ఎన్ని దశల్లో పూర్తి చేస్తారనే అంశంపై నోటిఫికేషన్ వస్తేగానీ స్పష్టత వచ్చేలా కనిపించటం లేదు.

వేసవి రాకముందే ఎండలు విపరీతంగా ఉండటంతో ప్రజలు ఓటు వేసేందుకు ఆసక్తి చూపరనే ఆందోళన ఒకింత కలవరపెడుతోంది.

Last Updated : Mar 10, 2019, 11:45 AM IST

ABOUT THE AUTHOR

...view details