రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన చంద్రగిరి నియోజకవర్గంలోని 7 కేంద్రాల్లో రీ పోలింగ్.. ప్రశాంతంగా పూర్తయింది. పాకాల మండలంలోని పులివర్తివారి పల్లె, రామచంద్రాపురం మండలంలోని కుప్పం బాదూరు, కాళేపల్లి, ఎన్ ఆర్ కమ్మపల్లె, కమ్మపల్లె, కొత్తకండ్రిగ, వెంకట్రామాపురం పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సజావుగా జరిగింది.
1 శాతం తగ్గిన ఓటింగ్
పాకాల మండలం పులివర్తి వారి పల్లెలో 95.03 శాతం... రామచంద్రాపురం మండలం కాలేపల్లిలో 94.64 శాతం, వెంకటరామాపురంలో 89.66 శాతం, కొత్తకండ్రిగలో 84.86 శాతం, కమ్మపల్లెలో 83.56 శాతం, ఎన్ ఆర్ కమ్మపల్లెలో 83.56 శాతం, కుప్పం బాదూరులో 92.04 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తంగా... ఈ ఏడు పోలింగ్ కేంద్రాల్లో 89.29 శాతం పోలింగ్ రికార్డ్ అయ్యింది. ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో ఈ పోలింగ్ కేంద్రాల్లో నమోదైన 90.42 శాతంతో పోలిస్తే....1.13 శాతం పోలింగ్ తక్కువగా నమోదైంది.
ఉదయం 6 గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా..... ఉదయం నుంచే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. ప్రచారం సమయంలో ఆయా గ్రామాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో..... వేరే గ్రామాలకు సంబంధించిన ప్రజలను పోలింగ్ కేంద్రాల వద్దకు అనుమతించకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. వాహనాలను తనిఖీ చేసి, గుర్తింపు కార్డులను చూసిన తర్వాతే.. ఆయా పోలింగ్ కేంద్రాల పరిసరాల్లోకి అనుమతించారు.