లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన ఘట్టం ముగిసింది. ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 62.25 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ అధికారులు వెల్లడించారు. ఇవాళ మధ్యాహ్నానికి పూర్తి వివరాలు ప్రకటించనున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో 76.07 శాతం పోలింగ్ నమోదు కాగా ఇప్పుడు ఓటర్లలో ఉత్సాహం గణనీయంగా తగ్గినట్లు కనిపిస్తోంది.
సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ పూర్తవ్వగా, మిగిలిన ప్రాంతాల్లో సాయంత్రం ఆరు గంటల వరకు ఎన్నికలు జరిగాయి. నిర్ధారిత సమయానికి పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న వారికి రాత్రి ఎనిమిది గంటల వరకు ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం లోక్‌సభ స్థానంలో రికార్డు స్థాయిలో 75.61 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా హైదరాబాద్ నగరంలో 39.49 శాతం పోలింగ్ జరిగింది. 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నిజామాబాద్ నియోజకవర్గంలో 54.20 శాతం పోలింగ్ నమోదైంది.
ఆసక్తి చూపని రాజధాని వాసులు
లోక్‌సభ ఎన్నికల్లో ఓటేసేందుకు భాగ్యనగర వాసులు అసక్తి చూపలేదు. రాష్ట్ర రాజధానిలో అత్యల్పంగా పోలింగ్ నమోదైంది. హైదరాబాద్‌లో తక్కువ పోలింగ్ నమోదవ్వడానికి అనేక కారణాలున్నాయి. హైదరాబాద్‌లో ఉన్న 70 లక్షల మంది ఓటర్లలో 15 లక్షల మందికిపైగా ఏపీ, తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడా ఓటు హక్కు ఉంది. ఏపీలో శాసనసభ ఎన్నికలు జరిగినందున దాదాపు 5 లక్షల మంది, పోరుగు జిల్లాల్లో ఓటు వేసేందుకు మరో 5 లక్షల మందికిపైగా వారి సొంత ఊర్లకు వెళ్లిపోయారు. ఇంకొందరు రాజధానిలోనే ఉన్నా ఓటు వేసేందుకు ముందుకు రాలేదు. ఫలితంగా నగరంలో ఏర్పాటు చేసిన అనేక పోలింగ్ కేంద్రాలు ఖాళీగా దర్శనమిచ్చాయి.
ఫలించిన ఈసీ ప్రయోగం
తొలిదశ ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక అభ్యర్థులు బరిలో ఉన్న నిజామాబాద్ లోక్‌సభ స్థానాన్ని ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. నిర్విఘ్నంగా పోలింగ్ ముగించి సవాల్‌ను అధిగమించింది. ఎన్నికపై తర్జన భర్జన పడిన ఎన్నికల సంఘం చివరకు ఈవీఎంల ద్వారానే నిర్వహించాలని నిర్ణయించింది. 27 వేల అత్యాధునిక ఈవీఎంలను యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రానికి పంపింది సీఈసీ. భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీలో ఉన్నపుడు తొలిసారిగా ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ శ్రీకారం చుట్టింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇందూరు ఎన్నికలను పూర్తి చేసి ఈసీ సత్తా చాటింది.
నియోజకవర్గాల వారీగా నమోదైన పోలింగ్ శాతం
ఖమ్మం | 75.61 |
భువనగిరి | 75.11 |
నల్గొండ | 74.12 |
మెదక్ | 71.56 |
ఆదిలాబాద్ | 71.98 |
కరీంనగర్ | 69.40 |
జహీరాబాద్ | 67.80 |
పెద్దపల్లి | 65.22 |
మహబూబ్‌నగర్ | 65.30 |
మహబూబాబాద్ | 64.46 |
నాగర్‌కర్నూల్ | 62.51 |
వరంగల్ | 60.00 |
నిజామాబాద్ | 54.20 |
చేవెళ్ల | 53.80 |
సికింద్రాబాద్ | 45.00 |
మల్కాజిగిరి | 42.75 |
హైదరాబాద్ | 39.49 |
ఇవీ చూడండి: ఓటరు సహనాన్ని పరీక్షించిన ఈవీఎంలు