తెలంగాణ

telangana

By

Published : May 22, 2019, 12:56 PM IST

Updated : May 22, 2019, 1:29 PM IST

ETV Bharat / state

వీవీప్యాట్ స్లిప్​లతో తెరపైకి మరో సమస్య

వీవీప్యాట్ లెక్కింపులో కొత్త సమస్య కనిపిస్తోంది. ఒక్కో వీవీప్యాట్‌లో ముద్రితమయ్యే స్లిప్‌ల సంఖ్య 1500 మాత్రమేనని ఎన్నికల సంఘం చెబుతోంది. 1500కు మించి ఓటర్లు ఉన్న బూత్‌లలో అంతకుమించి ఓట్లు పోలైతే పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది.

వీవీప్యాట్ స్లిప్​లతో తెరపైకి మరో సమస్య

వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించి వాటిని ఈవీఎంలలో పోలైన ఓట్లతో సరిపోల్చాలంటూ ఇప్పటికే విపక్షాలు దేశవ్యాప్త పోరాటం చేస్తున్నాయి. 21 విపక్ష పార్టీలు పలు దఫాలుగా ఎన్నికల సంఘాన్ని కలిసాయి. ఇప్పుడు కొత్తగా ఓ సమస్య వెలుగులోకి వచ్చింది. ఒక్కో వీవీప్యాట్‌లో ముద్రితమయ్యే స్లిప్‌ల సంఖ్య 1500 మాత్రమేనని ఎన్నికల సంఘమే స్పష్టం చేస్తోంది. 1500కు మించి ఓటర్లున్న బూత్‌లలో అంతకుమించి ఓట్లు పోలైతే పరిస్థితిపై సందిగ్ధత ఉంది. అలాంటి సందర్భాల్లో వీవీప్యాట్లలో స్లిప్‌ల రూపంలో నిక్షిప్తమవుతాయా? లేదా? అన్న అనుమానాన్ని ఎన్నికల సంఘం ముందు విపక్షాలు లేవనెత్తాయి. అయితే దీనిపై ఈసీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

వీవీప్యాట్ స్లిప్​లతో తెరపైకి మరో సమస్య

కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రచురించిన ‘'హ్యాండ్‌ బుక్‌ ఫర్‌ ఏజెంట్‌'’ అనే పుస్తకంలోనూ 1500 స్లిప్‌లే ముద్రితమవుతాయని స్పష్టం చేసింది. అందులోనూ 100 స్లిప్‌లు మాక్‌ పోలింగ్‌ కింద పోతాయని వెల్లడించింది. మిగిలిన పేపర్‌ ద్వారా పోలైన ఓట్లలో 1400 ఓట్లు మాత్రమే ముద్రించడం వీవీప్యాట్లకు సాధ్యమని ఎన్నికల సంఘమే వివరించింది. ఒక్కో పోలింగ్‌ బూత్‌లో సగటున 2వేలకు పైగా ఓటర్లు ఉన్న కేంద్రాలు అనేకం ఉన్నాయి. ఓట్ల లెక్కింపు రోజున వీవీప్యాట్లు ర్యాండమ్‌ పద్ధతిలో లెక్కించడానికి తీసుకున్నప్పుడు.. ఈవీఎంలలో 1500 మించి ఓట్లు కన్పించి.. వీవీప్యాట్లలో 1400 మించి కన్పించకపోతే ఎలా సరిపోల్చుతారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తేడా ఆధారంగా నియోజకవర్గం మొత్తం రీకౌంటింగ్‌ చేసినా అక్కడ 1500కు మించి పోలైన అన్ని యంత్రాల్లోనూ ఈ లోటు కన్పిస్తుంది. కాబట్టి కచ్చితత్వం అనేదే రాదన్న వాదన వినిపిస్తోంది.

ఈవీఎం, వీవీప్యాట్‌ స్లిప్‌లలో తేడాలు వస్తే వీవీప్యాట్ల ఆధారంగానే గెలుపు నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఈసీ నిబంధనలు చెబుతున్నాయి. మరి ఈవీఎం, వీవీప్యాట్లలో పోలైన ఓట్లకు వ్యత్యాసం వస్తే ఏం చేస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్​ చేస్తున్నాయి.

ఇవీ చూడండి: సార్వత్రిక ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

Last Updated : May 22, 2019, 1:29 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details