తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎగువ సభ ఎవరిని వరించునో..?

ఎండాకాలం... వానాకాలం... శీతాకాలం(చలికాలం) సాధారణంగా వచ్చేవి. మరీ తెలంగాణలో ఎన్నికల కాలం నడుస్తోంది... ఇదేంటి అనుకుంటున్నారా? అవును అక్షర సత్యం.... మరికొద్దిరోజుల్లో శాసన మండలి, పార్లమెంటు, మండల, జిల్లా పరిషత్, సహకార సంఘాలు, పురపాలికల ఎన్నికలు వరుసగా జరగనున్నాయి.

ఎగువ సభ ఎవరిని వరించునో..?

By

Published : Feb 13, 2019, 12:57 PM IST

Updated : Feb 13, 2019, 4:47 PM IST

ఎగువ సభ ఎవరిని వరించునో....?
తెలంగాణలో మరో మిని ఎన్నికల శంఖారావానికి తెర లేవనుంది. పార్లమెంటు ఎన్నికలు అనుకుంటే పొరపాటే.... కాదండోయ్... శాసనమండలికి త్వరలో ఎన్నికల ప్రకటన వెలువడనుంది. మార్చినాటికి పదవి కాలం ముగిసేవాటితో కలుపుకొని 16 స్థానాలు ఖాళీలవుతున్నాయి. అందులో గవర్నర్​ కోటాలో ఒకటి మినహా అన్నింటికీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. తెరాస అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. గెలుపు గుర్రాలు ఎవరు అనేది కేసీఆర్ సర్వేలో తేలనుంది. పాత కొత్త కలయికతో మండలి ఉండే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారనే ముచ్చట మెుదలైంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లిన నల్గొండ స్థానంపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యే కోటా తప్ప మిగతా..... స్థానిక సంస్థలు, ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలపై గులాబీ దళపతి ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ నియోజకవర్గాల్లో ఆశావహులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. పలు ఉపాధ్యాయ సంఘాలు తమ అభ్యర్థులను ప్రకటించి, ప్రచార రంగలోకి దింపారు. ప్రతిపక్ష పార్టీల్లో వీటి ఊసే లేదు.


ఈ సమరంలో గవర్నర్, ఎమ్మెల్యే కోటాలో అధిక భాగం స్థానాలు అధికార పార్టీ వశం కావడం ఖాయం. అసెంబ్లీలో సుమారు 90 మంది ఎమ్మెల్యేలు ఉండటమే కారణం. గత ఎన్నికల్లో అవకాశం రానివారితో పాటు తాజా మాజీలు మరోసారి అవకాశం కోసం పోటీ పడుతున్నారు. మహమూద్ అలీ, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డిల పదవీ కాలం మార్చితో ముగియనుంది. మహమూద్ అలీకి హోంశాఖ కేటాయించడంతో ఆయన బెర్తు ఖరారైనట్లే. మండలి ఛైర్మన్ గత ఎన్నికల్లో రాజేందర్​నగర్ సీటు ఆశించినా... ఫలితం దక్కలేదు. ఈ విషయంలో ఆయన కొంత అలకబూనారనే వార్తలూ వచ్చాయి. ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన పలువురి నేతలకు గులాబీ బాస్ మండలిలో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అందరు ఎమ్మెల్యే కోటా వైపు చూడడం తలనొప్పిగా మారిందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. అసెంబ్లీ , గ్రామ పంచాయతీ ఎన్నికల మాదిరిగానే.... మండలిలోనూ కారు హవా కొనసాగించాలనే ఉద్దేశంతో అభ్యర్థుల ఎంపిక విషయంలో కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు.


ఉద్యమ సమయంలో తెరాసకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు అండగా ఉన్నాయి. వీరి విషయంలో పాత వారికే మరోసారి అవకాశం కల్పిస్తారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. మెదక్, ఆదిలాబాద్​, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల స్థానం నుంచి మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, కరీంనగర్ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, గ్రూపు-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్, సరోజిని కంటి ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ రవీందర్ గౌడ్ తీవ్రంగా పోటీ పడుతున్నారు.

వరంగల్ , రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. గవర్నర్​, ఎమ్మెల్యే, స్థానిక సంస్థల కోటా నుంచి శేరి సుభాష్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, మధుసుదనాచారి, గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, కేఆర్ సురేష్​ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, జాగృతి నేత మేడే రాజీవ్ సాగర్​తో పాటు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పలువురు అభ్యర్థులు ఆశావహులుగా ఉన్నట్టు చర్చ జోరుగా సాగుతోంది.

Last Updated : Feb 13, 2019, 4:47 PM IST

ABOUT THE AUTHOR

...view details