హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో 2సార్లు తప్ప ఆది నుంచీ కాంగ్రెస్, మజ్లిస్దే హావా నడుస్తోంది. 19లక్షల 59 వేలకుపైగా ఓటర్లుండగా...60శాతంతో 11లక్షల 75వేల మంది ముస్లింలే ఉన్నారు. కానీ పోలింగ్ మాత్రం 60 నుంచి 70శాతమే నమోదవుతుంది. ఈసారి అత్యధిక మెజారిటీపై కన్నేసిన అసదుద్దీన్ పోలింగ్ శాతాన్ని పెంచేందుకు దృష్టి సారించారు.
ఆధిక్యంపై కన్ను...
మొదట్లో ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్సే విజయ బావుటా ఎగురవేసింది. 1971లో మాత్రమే తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థి విజయం సాధించారు. 1984లో స్వతంత్ర అభ్యర్థి సలావుద్దీన్ ఓవైసీ గెలుపుతో కాంగ్రెస్ కనుమరుగైంది. 1989 నుంచి 1999 వరకు సలావుద్దీన్ ఎంఐఎం తరఫున గెలిచారు. 2004లో తొలిసారి లోక్సభ బరిలో నిలిచిన అసదుద్దీన్ ఓవైసీ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. 2014లో భాజపా అభ్యర్థిపై 2లక్షల మెజారిటీతో గెలిచిన అసద్...ఈసారి రికార్డు ఆధిక్యంపై కన్నేశారు. పోలింగ్ శాతాన్ని పెంచి లక్ష్యాన్ని సాధించేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు.