ఖరీఫ్ సాగుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. రైతాంగానికి అవసరమైన విత్తనాలు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సిద్ధంగా ఉంచింది. విత్తనాల విషయంలో రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రావొద్దని ఆ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఖరీఫ్‌లో సాగు చేసే వివిధ రకాల పంటలకు సంబంధించి 7.50 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అంచనా వేయగా... అందుకోసం 174 కోట్ల 87 లక్షల రూపాయల రాయితీ ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ, హాకా, ఆయిల్‌ఫెడ్, మార్క్‌ఫెడ్, జాతీయ విత్తన కార్పొరేషన్ వంటి ప్రభుత్వ నోడల్ ఏజన్సీల ద్వారా విత్తనాలు సరఫరా చేస్తారని పేర్కొన్నారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు ఎంపిక చేసిన 1498 ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాలు, ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, మన గ్రోమోర్ కేంద్రాల ద్వారా రాయితీ విత్తనాలు అందజేయనున్నట్లు తెలిపారు.