ఎస్సారెస్పీపై సీఎం సమీక్ష వచ్చే జూన్ నాటికి ఎస్సారెస్పీ ప్రాజెక్టు కాల్వలు, తూముల నిర్మాణం, లైనింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మేడిగడ్డ బ్యారేజీ నుంచి వర్షాకాలంలో నీటిని మధ్య, దిగువ మానేరు జలాశయాలకు తరలిస్తామని తెలిపారు. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా చెరువులు నింపాలని సూచించారు.
భూ సేకరణ, ఇతర పనులకు కావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖను కేసీఆర్ ఆదేశించారు. మొదటి దశతో పాటు రెండో దశలో నిర్మించిన కాల్వలకు లైనింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. కాల్వల సామర్థ్యాన్ని పెంచాలని, ఎక్కడ ఏ పని చేయాలో గుర్తించేందుకు వెంటనే 50 మంది ఇంజినీర్లను నియమించి.. యుద్ధప్రాతిపదికన సర్వే చేసి అంచనాలు రూపొందించాలని సూచించారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల సమగ్ర సమాచారం తయారు చేసి, వాటి నిర్వహణకు నిబంధనలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. వ్యయం అంచనా వేస్తే ఆ నిధులు బడ్జెట్లోనే కేటాయిస్తామన్నారు. కడెం గేటు మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలని చెప్పారు. ఎస్సారెస్పీ పంట కాల్వలను ఎవరైనా దున్నుకుంటే, వాటిని పునరుద్ధరించాలని, ఎమ్మెల్యేలు చొరవ చూపి రైతులను ఒప్పించాలన్నారు.
చనాఖా-కొరాటా ఆనకట్ట పనులు మే 15 నాటికి పూర్తి కావాలని లక్ష్యం నిర్ధేశించారు. దేవాదుల నీటిని తరలించే రామప్ప, లక్నవరం, ఘనపూర్, పాకాల కాల్వల పనులను ఈ ఎండాకాలంలోనే పూర్తి చేయాలని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్న పాలకుర్తి, ఉప్పుగల్లు, చెన్నూరు రిజర్వాయర్ల నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.