ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. టీఆర్టీలో ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వుల జారీకి విధివిధానాలు ఖరారు చేసింది. ఇందుకోసం పాత జిల్లాల ప్రాతిపదికన కమిటీలు ఏర్పాటు చేసింది. ఛైర్మన్గా కలెక్టర్, వైస్ ఛైర్మన్గా జాయింట్ కలెక్టర్, కార్యదర్శిగా డీఈవో, సభ్యులుగా జడ్పీ సీఈవో, మున్సిపల్ కమిషనర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, కొత్త జిల్లా డీఈవో ఉంటారు.
రోస్టరు, ర్యాంకు వారీగా ఎంపికైన అభ్యర్థుల వివరాలు పాఠశాల విద్యాశాఖ కమిషనర్... జిల్లా ఎంపిక కమిటీలకు పంపిస్తారు. డీఈవోలు సబ్జెక్టు, మీడియం, ప్రాంతం వారీగా ఖాళీలు గుర్తించి... ఉపాధ్యాయులు లేని, ఏకోపాధ్యాయ పాఠశాలలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చేలా నివేదిక సిద్ధం చేసుకోవాలి. బాలికల పాఠశాలల్లో మహిళ అభ్యర్థులకే ప్రాధాన్యం ఇవ్వాలి.