తెలంగాణ

telangana

ETV Bharat / state

పాతబస్తీలో పతంగి ఎగిరేనా? - hyderabad parliament

పాత బస్తీలో పట్టు నిలుపుకునేందుకు సిద్ధమవుతోంది మజ్లిస్. హైదరాబాద్ లోక్​సభపై 'పతంగి' ఎగురవేసి ఏకఛత్రాధిపత్యాన్ని చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు స్థానాలు గెలిచిన ఎంఐఎం అదే ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు లోక్​సభ బరిలో దిగుతోంది.

హైదరాబాద్​లో మజ్లిస్ హవా

By

Published : Mar 11, 2019, 1:34 PM IST

హైదరాబాద్ ఓవైసీ కుటుంబానిదే

హైదరాబాద్ పాతనగరంలో ఆల్ ఇండియా ఇతైహదుల్ ముస్లిమీన్ గత కొన్నేళ్లుగా తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరుస్తోంది. హైదరాబాద్ లోక్​సభ స్థానంలో 1984 నుంచి ఓవైసీ కుటుంబమే గెలుస్తోంది. సలావుద్దీన్ ఓవైసీ 1984లో స్వతంత్ర అభ్యర్థిగా, 1989 నుంచి 1999 వరకు ఎంఐఎం తరుఫున వరుసగా ఐదుసార్లు గెలిచారు. అనంతరం 2004 నుంచి 2014 వరకు అసదుద్దీన్ ఓవైసీ గెలిచి హాట్రిక్ సాధించారు. మరోసారి లోక్​సభ బరిలో నిలిచేందుకు అసద్ సిద్ధమవుతున్నారు.

తెరాసతోనే...

గతంలో ఎంఐఎం, కాంగ్రెస్​తో కలిసి ఎన్నికలకు వేళ్లేది. తెలంగాణ ఏర్పాటు తర్వాత... మజ్లిస్, తెరాస మధ్య మైత్రి బలపడింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తెరాస అభ్యర్థులను ప్రకటించినప్పటికీ ఎంఐఎంతో స్నేహపూర్వక పోటీ చేసింది. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లోనూ... పట్టున్న ఏడు స్థానాలతోపాటు రాజేంద్రనగర్​లో మాత్రమే అభ్యర్థిని నిలిపి మిగతా చోట్ల 'కారుకే మా మద్దతు' అని బహిరంగంగానే ప్రకటించింది.

పక్క రాష్ట్రాల్లోనూ పోటీ

లోక్​సభ ఎన్నికల్లోనూ అదే మైత్రిని కొనసాగిస్తూ... 16 చోట్ల తెరాస, హైదరాబాద్​లో ఎంఐఎం పోటీ చేయబోతున్నాయి. తెరాసకు 16, మజ్లిస్​కు ఒక స్థానం అంటూ ఇరుపార్టీల నేతలు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. కేసీఆర్ చెప్తోన్న కాంగ్రెస్, భాజపాయేతర సమాఖ్య కూటమికి ఎంఐఎం జై కొట్టింది. ఇతర రాష్ట్రాల్లోనూ అభ్యర్థులను నిలిపే అవకాశం కన్పిస్తోంది. ఇప్పటికే బిహార్ కిషన్ గంజ్ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అక్తరుల్ ఇమాన్​ను ప్రకటించింది. మహారాష్ట్ర ఔరంగాబాద్, ఉత్తర్ ​ప్రదేశ్​లోనూ పోటీ చేసేందుకు మజ్లిస్ కసరత్తు చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి కోరితే ఆంధ్రప్రదేశ్​లో వైకాపాకు మద్దతుగా ప్రచారం చేసేందుకు సిద్ధమేనని గతంలో అసద్ ప్రకటించారు.

ఈసారి అసద్​పై కాంగ్రెస్​ బలమైన అభ్యర్థిని బరిలోకి దింపే యోచనలో ఉంది. మరి ఎంఐఎం ఏ రకమైన వ్యూహ రచన చేస్తుందన్నది వేచి చూడాలి.

ABOUT THE AUTHOR

...view details