తెలంగాణ

telangana

ETV Bharat / state

చేతులు కాల్చుకుంటున్న కాంగ్రెస్ - congress mlas

శాసనసభ ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డా కళ్లు తెరవలేదు. ఒక్క ఎమ్మెల్సీ సీటు దక్కాల్సి ఉన్నా చేతులు కాల్చుకున్నారు. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కారెక్కుతుంటే..కళ్లప్పగించి చూస్తున్నారు. కనీసం లోక్​సభ ఎన్నికల్లోనైనా వ్యూహ ప్రతివ్యూహాలతో వెళ్లకుండా ఎవరికివారే యమునాతీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు.

హస్తవ్యస్తం

By

Published : Mar 14, 2019, 5:58 PM IST

Updated : Mar 14, 2019, 6:42 PM IST

తెలంగాణ కాంగ్రెస్ హస్తవ్యస్తంగా తయారైంది. అసెంబ్లీ ఎన్నికల్లో 19 స్థానాలకే పరిమితమైనా.. స్వయంకృపారాథంతో ఎమ్మెల్యేలను చేజార్చుకుంటోంది. ఒక్కక్కొక్కరుగా పార్టీని వీడుతున్నా రాష్ట్ర నాయకత్వం మేల్కొనడం లేదు. పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు, శాసనసభ పక్ష నేత చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లో సంఖ్యాపరంగా తెరాసకు నాలుగు, కాంగ్రెస్‌కు ఒకటి రావాల్సి ఉంది. కానీ ఆ అవకాశాన్ని కూడా జార విడుచుకుంది. స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఎకగ్రీవానికి మద్దతివ్వాలని తెరాస కోరినప్పుడు తమకు దక్కాల్సిన ఎమ్మెల్సీని ఇవ్వాల్సిందేనని ఒత్తిడి చేయలేకపోయింది. నామినేషన్ గడువుకు గంట ముందు అభ్యర్థిని ప్రకటించింది. అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థి ఎంపికలో విఫలమైంది. అప్పటికే ఆపరేషన్ ఆకర్ష్​లో భాగంగా ఒక తెదేపా, నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తిప్పుకుంది. గత్యంతరం లేక కాంగ్రెస్ ఎన్నికలను బహిష్కరించడంతో ఏకపక్షంగా ఐదు ఎమ్మెల్సీ స్థానాలను ఎగరేసుకుపోయింది.

సుదీర్ఘకాలం పార్టీకి సేవలందించి, మొదటి మహిళా హోం మంత్రిగా పనిచేసిన సబితాఇంద్రారెడ్డి కొన్నాళ్లుగా అసంతృప్తిలో ఉన్నారని తెలిసినా పట్టించుకోలేదు. చేవెళ్లలో జరిగిన రాహుల్ సభలో పాల్గొన్న ఆమె..మరుసటిరోజే అధికార పార్టీతో చర్చలు జరిపి షాకిచ్చారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు..చివరి నిమిషంలో ఎంత ప్రయత్నం చేసినా ఫలించలేదు. బుధవారం ముఖ్యమంత్రితో రెండుగంటలు చర్చించిన సబితారెడ్డి తెరాసలో చేరుతున్నట్టు ప్రకటించారు.

ఇప్పటికే ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియ నాయక్, సబితా ఇంద్రారెడ్డి గులాబీ గూటికి చేరుతున్నట్టు ప్రకటించారు. తాజాగా పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్​రెడ్డి కూడా కారెక్కబోతున్నారు.

లోక్​సభ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వెళ్లాల్సిన హస్తం నేతలు..పట్టిపట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతుండడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఇవీ చూడండి:తీగలతో సబితా ఇంద్రారెడ్డి భేటీ

Last Updated : Mar 14, 2019, 6:42 PM IST

ABOUT THE AUTHOR

...view details