కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్షంలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ... సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన దీక్ష పార్టీ నేతల మధ్య విభేదాలకు అవకాశం ఇచ్చింది. 36 గంటల పాటు ప్రజా పరిరక్షణ దీక్ష చేయాలని పోలీసుల అనుమతి తీసుకొని ఈ నెల 8న ఉదయం 11 గంటలకు ప్రారంభించారు. దీక్ష కొనసాగుతుండగా... దీనిని ప్రజాస్వామ్య పరిరక్షణ ఆమరణ దీక్షగా మార్పు చేస్తున్నట్లు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. 9వ తేదీ రాత్రి 11 గంటలకు అనుమతి ముగిసినందున భగ్నం చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసి విమర్శలు వస్తాయని వెనక్కి తగ్గారు. మరుసటి రోజు ఉదయం 7 గంటలప్పుడు శిబిరంపై దాడి చేసి భట్టిని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
ఆమరణ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మాజీ లోక్సభ స్పీకర్ మీరా కుమార్ పరామర్శించేందుకు వస్తున్నట్లు పీసీసీకి సమాచారం అందింది. దీక్ష కొనసాగిస్తే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచినట్లవుతుందని ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు. కొనసాగించేందుకు నిర్ణయించుకున్న భట్టి వైద్యం చేయించుకోవడానికి నిరాకరించారు. ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు హెచ్చరించడం వల్ల మల్లు రవి జోక్యం చేసుకుని ఉత్తమ్ ప్రతిపాదనకు అభ్యంతరం చెప్పారు. వి. హనుమంతరావు కూడా రవికి మద్దతు తెలపటం వల్ల ఉత్తమ్ మిన్నకుండిపోయారు. నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు.