తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు ఇంటర్​ బోర్డు ముట్టడి, నిరవధిక నిరాహార దీక్ష - inter board

ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ అఖిలపక్ష నేతలు, తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ బోర్డు ముట్టడికి పిలుపునిచ్చారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నిరవధిక నిరాహార దీక్ష చేయనున్నారు. ఈ వివాదంపై హైకోర్టు నేడు మరోసారి విచారణ చేపట్టనుంది. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు న్యాయస్థానానికి వివరించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది

నేడు ఇంటర్​ బోర్డు ముట్టడి

By

Published : Apr 29, 2019, 6:04 AM IST

Updated : Apr 29, 2019, 9:14 AM IST

నేడు ఇంటర్​ బోర్డు ముట్టడి
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో తప్పులపై నిరసన జ్వాలలు చల్లారడం లేదు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించడంతోపాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్​తో... బోర్డు ముట్టడికి అఖిలపక్షం పిలుపునిచ్చింది. కాంగ్రెస్, తెదేపా, సీపీఐ, సీపీఎం, తెలంగాణ జన సమితి, జనసేన పార్టీల అగ్రనేతలు ధర్నాలో పాల్గోనున్నారు. ఓ ప్రైవేట్ సంస్థ కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. సమాధాన పత్రాలన్నీ మళ్లీ మూల్యాంకనం చేయాలని.. మంత్రి జగదీశ్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇంటర్ ఫలితాల వ్యవహారంలో అక్రమాలకు నిరసనగా... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నారు. నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో ఇవాళ దీక్ష ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ప్రభుత్వం స్పందించే వరకూ కొనసాగుతుందని తెలిపారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇంటర్ ఫలితాల వివాదంపై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్​ఎస్​ చౌహాన్​ నేతృత్వంలోని ధర్మాసనం నేడు మరోసారి విచారణ జరపనుంది. జవాబు పత్రాలు మళ్లీ మూల్యాంకనం చేయాలని... ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కోరుతూ బాలల హక్కుల సంఘం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. అనుత్తీర్ణలైన విద్యార్థుల సమాధాన పత్రాలు పునఃమూల్యాంకనం చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, సమస్య పరిష్కారానికి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని హైకోర్టు గతంలో ఇంటర్ బోర్డును ఆదేశించింది. బదులుగా ఫెయిలైన విద్యార్థులకు ఉచితంగా పునఃపరిశీలన ప్రక్రియ చేపట్టామని, తప్పుడు మూల్యాంకనం చేసిన ఇద్దరిపై చర్యలు తీసుకున్నామని వివరించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది.

ఇవీ చూడండి: ముగిసిన రెండో విడత నామినేషన్ల స్వీకరణ

Last Updated : Apr 29, 2019, 9:14 AM IST

ABOUT THE AUTHOR

...view details