Councilors Demand for Muncipal Chairman Resignation : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపల్ పాలకవర్గంలో విభేదాలు తారస్థాయికి చేరాయి. మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుపై కలెక్టర్‌కు అసమ్మతి నోటీసు సమర్పించినప్పటి నుంచి తమపై వేదింపులు పెరిగాయని కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిల్ సమావేశాల్లో తమను హేళన చేస్తున్నారని, వార్డు సమస్యలను విన్నవించినా... పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ నేపథ్యంలో తాము ఛైర్మన్‌పై అసమ్మతి తెలిపినట్టు చెప్పారు.
అసమ్మతి గళం వినిపిస్తున్న కౌన్సిలర్లు పార్టీకీ, ఎమ్మెల్యే హరిప్రియకు విధేయులమని తెలిపారు. కానీ తమ బాధంతా మున్సిపల్ ఛైర్మన్ తోనే అని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి తామందరం కావాలా...? ఒక్కరు కావాలో పార్టీ పెద్దలే తేల్చుకోవాలని సూచించారు. తమలో ఒక్కరిపై చర్యలు తీసుకున్న మూకుమ్మడిగా అందరం రాజీనామా చేస్తామని హెచ్చరించారు. భద్రాద్రి బీఆర్ఎస్ అధ్యక్షులు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఎమ్మెల్యే హరిప్రియలను కూడా మున్సిపల్ ఛైర్మన్ పట్టించుకోవడం లేదని... ఆయన సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ తాతామధుతో కలిసి కుల రాజకీయాలు చేస్తున్నారన్నారని ధ్వజమెత్తారు.
'ఛైర్మన్ వెంకటేశ్వరరావు వేధింపులు తాళ్లలేకే అసమ్మతి తెలిపాం. వార్డు సమస్యలు చెప్పినా పట్టించుకోవడం లేదు. కౌన్సిల్ సమావేశాల్లో హేళన చేస్తున్నారు. పార్టీకీ, ఎమ్మెల్యే హరిప్రియకి విధేయులం. మేమందరం కావాలా? ఒక్కరు కావాలా ? పార్టీ పెద్దలు తేల్చుకోవాలి. మాలో ఒక్కరిపై చర్యలు తీసుకున్నా అందరం రాజీనామా చేస్తాం. ఎమ్మెల్యేను కూడా పట్టించుకోవడం లేదు.'- అసమ్మతి కౌన్సిలర్లు, ఇల్లెందు మున్సిపాలిటీ