భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని దుమ్ముగూడెం ఆనకట్ట జలకళను సంతరించుకుంది. కట్టపై నుంచి గోదావరి జలాలు పొంగిపొర్లుతూ సుందర దృశ్యాన్ని ఆవిష్కరిస్తోంది. మే నెలలో గోదావరి నీటిమట్టం గణనీయంగా తగ్గింది. గతేడాది నీరు లేక భారజల కర్మాగారం మూసివేసిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని సత్వరమే మేడిగడ్డ నుంచి జలాలను విడుదల చేశారు. అవి ఇక్కడికి చేరుకోవడానికి 3 రోజులు పట్టింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు గోదావరిలోకి కొత్తగా జలాలు చేరుకుంటున్నాయి. ఈ దశలో గోదావరి ఆనకట్టపై నుంచి గోదావరి నీటి ప్రవాహం పొంగిపొర్లుతుంది. దుమ్ముగూడెం ఆనకట్ట జలకళను సంతరించుకోవడం వల్ల స్థానికులు ఆ సుందర దృశ్యాన్ని వీక్షించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆనకట్ట వద్దకు వీక్షకులు చేరుకొని నీటి ప్రవాహాన్ని తిలకిస్తున్నారు.
కొత్త బ్యారేజ్ నిర్మాణం...
దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద తెలంగాణ ప్రభుత్వం 37 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో కొత్త బ్యారేజ్ నిర్మించేందుకు సిద్ధమైంది. సీతమ్మ సాగర్ పేరుతో నిర్మించే బ్యారేజీకి ప్రభుత్వం సుమారు రూ. 3 వేల కోట్లను ఖర్చు చేయనుంది. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి అయింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే సుమారు గోదావరి నదికి ఇరువైపులా 40 కిలోమీటర్ల మేర గోదావరి జలాలు నిండుగా ఉండనున్నాయి. వేసవికాలంలో తాగు, సాగు, పరిశ్రమలకు నీటి కష్టాలు తీరనున్నాయి.
దుమ్ముగూడెం ఆనకట్టకు జలకళ
దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద జలకళ ఉట్టిపడుతోంది. భారజల కర్మాగారం కోసం మేడిగడ్డ నుంచి జలాలను విడుదల చేయడం వల్ల ఆ జలాలు దుమ్ముగూడెం ఆనకట్ట వద్దకు చేరుకున్నాయి. దీంతో ఆ ప్రాంతం జలకళను సంతరించుకుంది. ఆ సుందర దృశ్యాన్ని వీక్షించేందుకు వీక్షకులు తరలివస్తున్నారు.
దుమ్ముగూడెం ఆనకట్టకు జలకళ