భూమిపై హక్కుల కోసం ఆదివాసీలు సుదీర్ఘంగా సాగించిన పోరాటాలను గుర్తించి 2005లో అటవీ హక్కుల చట్టాన్ని ప్రవేశపెట్టారు. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం డిసెంబరు 13, 2005కు ముందు పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులు హక్కుపత్రాలు పొందటానికి అర్హులు. చట్టం అమలు కోసం జిల్లాలో 2008 నుంచి 2010 మధ్య పలు దఫాలుగా అటవీ, రెవెన్యూ, ఐటీడీఏ శాఖలు సమావేశం అయ్యాయి. 2005 డిసెంబరు 13 వరకు పోడు సాగు చేసుకొన్న వారికి ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం ప్రకారం ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలను పంపిణీ చేశారు. అపరిష్కృత భూములకు సంబంధించి హక్కుపత్రాల సంగతేంటో అటవీ, రెవెన్యూ, ఐటీడీఏ అధికారులు నేటికీ తేల్చకపోవడంతో వివాదాలు నిత్యం రగులుతూనే ఉన్నాయి.
వలసలతో పెరిగిన పోడు
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 30 వేల మందికి పైగానే రకరకాల కారణాలతో ఛత్తీస్‌గఢ్ నుంచి వలసలు రాగా ఇందులో అత్యధికులు గొత్తికోయలే. కుక్కునూరు, వేలేరుపాడు (ప.గో), కూనవరం, వరరామచంద్రాపురం, చింతూరు, ఎటపాక (తూ.గో) జిల్లాలతోపాటు భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. పాల్వంచ, ములకలపల్లి, మణుగూరు, పినపాక, బూర్గంపాడు మండలాల్లోనూ వీరి నివాసాలు ఉన్నాయి. అన్ని వర్గాలకు చెందిన గిరిజనులు దశాబ్దాల ముందు నుంచే అడవులను, పొదలను తొలగించి జొన్న, రాగులు, మొక్కజొన్న, పెసలు, కందులు, వరి వంటివి సాగు చేస్తున్నారు. చట్టాన్ని అమలు చేయాలని ఎంతో కాలంగా ఉద్యమాలు చేస్తున్నా ఫలితం ఉండటం లేదు.
అపరిష్కృతంగా సంయుక్త సర్వేలు..
జిల్లాలో పోడు సాగు అటవీ హక్కుల చట్టం అమల్లోకి వచ్చాక పెరిగిందని అటవీశాఖ చెపుతుండగా గిరిజనులు మాత్రం తాము ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్నాము అని వాదిస్తున్నారు. కొత్తగా అడవి నరికి సేద్యం చేసిన వారినే (అంటే 2006 తరువాత) అడవుల్లోకి వెళ్లనీయం అంటుండగా చాలా ఏళ్లుగా సాగు చేస్తున్నా హక్కుపత్రాలు ఇవ్వడంలో వివక్ష చూపారని గిరిజనులు విమర్శిస్తున్నారు.
అధికారులపై దాడులు తగవు