భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పులి సంచారం కలకలం వీడటం లేదు. దాదాపు ఐదు మండలాల్లో సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు లభించాయి. తొలుత ఆళ్లపల్లి మండలంలో అటవీ ప్రాంతాల్లో పులి పాదముద్రలు కనిపించాయి. ఆ తర్వాత రోజుకోచోట సంచరిస్తుందంటూ... వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. గుండాల, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, పాల్వంచ మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు గుర్తించారు. అశ్వాపురం మండలం రామచంద్రాపురం-ఒడ్డుగూడెం గ్రామాల మధ్య కడియాల బుడ్డివాగు సమీపంలో పులిని చూసినట్లు స్థానికులు అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. అశ్వాపురం మండలం వెంకటాపురం సమీప పెద్దగుట్ట అటవీ ప్రాంతంలో ఆవు కళేబరం కనిపించడంతో పులి తిని ఉండొచ్చని స్థానికులు మరింత భయపడుతున్నారు.
ఒక్కటా..? రెండా..?
బూర్గంపాడు మండలం సందెళ్ల రామాపురం వద్ద పొలంలో పులి జాడలు కనిపించాయని అటవీశాఖ అధికారులకు రైతు సమాచారం అందించారు. ఆయా ప్రాంతాల్లో పర్యటించిన అటవీ శాఖ అధికారులు.. పులి అడుగులేనని తేల్చడంతో పొలాలకు వెళ్లాలంటేనే కర్షకులు వణికిపోతున్నారు. రైతులు, కూలీలు పని మానేసి ఇంటివద్దే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇటీవల పాల్వంచ మండలం పాండురంగాపురం వేల్పుల గుట్టలో పులి నడయాడినట్లు స్థానిక అన్నదాతలు గుర్తించారు. తాజాగా మణుగూరు ఓసీ-2 పైపుల యార్డు వద్దకు వచ్చినట్లు భద్రతా సిబ్బంది గుర్తించడం కలకలం రేపుతోంది. ఐదు మండలాల్లో తిరుగుతున్న పులి ఒక్కటేనా... రెండున్నాయా అన్నది ఇంకా తేలడం లేదు.