Maoists Encounter in Bhadradri : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఛత్తీస్గఢ్ - తెలగాణ సరిహద్దు ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఒక యాక్షన్ టీం పోలీసులపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుందనే విశ్వసనీయ సమాచారంతో.. ముందస్తుగా తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ చేపట్టాయి.
ఈ క్రమంలో వడ్డిపేట-పూసుగుప్ప అటవీ ప్రాంతంలో మావోయిస్టులు కాల్పులు చేపట్టగా పోలీసులు ఎదురు దాడికి తెగబడ్డారు. కొన్ని నిమిషాల పాటు జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారని పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారిలో ఐవోఎస్ కమాండర్ రాజేశ్ ఉన్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు. మృతి చెందిన ఇద్దరి మావోయిస్టుల మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు
Firing between police and Maoists in Bhadrachalam: మరోవైపు ఎన్కౌంటర్కు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ జి. వినిత్ వివరించారు. తెలంగాణ-ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఒక యాక్షన్ టీం పోలీసులపై దాడి చేయాలనే లక్ష్యంతో సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం వచ్చిందని తెలిపారు. ఈ క్రమంలోనే తమ టీమ్ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించినట్లు వెల్లడించారు.