trs ex mla thati venkateswarlu comments: తెరాసకు మరో షాక్ తగలనుంది. పీజేఆర్ కుమార్తె, తెరాస ఖైరతాబాద్ కార్పొరేటర్‌గా ఉన్న విజయారెడ్డి గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఇప్పుడు అశ్వారావు పేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆ పార్టీని వీడేందుకు సిద్దమయ్యారు. తెరాస పార్టీలో తనకు సరైన గుర్తింపు దక్కడం లేదంటూ ఆవేదన చెందారు. పలువురు స్థానిక నేతలతో కలిసి అశ్వారావుపేట ప్రెస్ క్లబ్‌లో తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తాను అనేక అవమానాలు ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నెల 18న ఖమ్మంలో జరిగిన రాజ్యసభ సభ్యలు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డిల కృతజ్ఞత సభకు సంబంధించిన ఫ్లెక్సీల్లోనూ తన ఫొటో వేయలేదని వాపోయారు. 2018లో జరిగిన ఎన్నికల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వగ్రామమైన గండుగులపల్లిలోనూ ఓట్లు వేయించలేకపోయారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇతర నియోజకవర్గాల్లో ఓట్లు వేయించే స్థాయి తుమ్మలకు లేదని ఆరోపించారు.
'' ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెరాస పార్టీ పరిస్థితి బాగొలేదు. అశ్వరావుపేట తెరాస ఇన్‌ఛార్జ్‌గా కేటీఆర్ నన్ను ప్రకటించినప్పటికీ.. ఎవరూ నన్ను గుర్తించట్లేదు. రాజకీయంగా నన్ను అణగదొక్కే శక్తులు తెరాసలోనే ఉన్నాయి. నా కుమార్తె చనిపోతే కూడా.. పార్టీలో నేతలు పరామర్శించలేదు. తెరాస అధిష్ఠానం ఇకనైనా గుర్తించి నాకు పార్టీలో గుర్తింపు ఇవ్వాలి. వచ్చే ఎన్నికల్లో అశ్వరావుపేట నుంచే బరిలోకి దిగుతా.. నాలాగే మరెంతో మందికి తెరాస పార్టీలో అవమానం జరుగుతోంది. అధిష్ఠానం ఈ విషయాన్ని గుర్తించి.. ప్రాధాన్యతనివ్వాలి.'' -మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు
ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలనలో గిరిజన ప్రజా ప్రతినిధులకు అవమానాలే ఎదురయ్యాయని అన్నారు. తాను 1981లోనే సర్పంచ్‌గా గెలిచిన సీనియర్ నాయకుడినని తెలిపారు. ఈ విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ సైతం తనకు జూనియర్ అవుతారన్నారు. ఇటీవల ఖమ్మం పర్యటనలో నాయకులందరినీ కలుపుకొని వెళ్లాలని జిల్లా నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేసినప్పటికీ అయన ఆదేశాలు ఎక్కడా అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధిష్ఠానం స్పందించకపోతే పార్టీని వీడటం ఖాయమని తాటి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.
మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సంచలన వ్యాఖ్యలు ఇవీ చదవండి: