ఇతరులతో పోల్చుకుంటే గిరిజనుల జీవన విధానం కాస్త భిన్నంగా ఉంటుంది. అప్పట్లో వారు ఉపయోగించే అటవీ ఉత్పత్తులు వింతగా ఉండేవి.. వాటిని మనం అరుదుగా చూస్తుంటాం. వీటిని మరుగున పడిపోకుండా.. ముందు తరాలకు అందించడం కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏలో గిరిజన మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు.
గిరిజనుల అభివృద్ధి సాంప్రదాయలకు ప్రతీక ఈ మ్యూజియం ఆదివాసీ సంప్రదాయం ఉట్టిపడేలా..
ఆదివాసీల సమస్యలు పరిష్కరించడంతో పాటు వారి సంస్కృతి.. సంప్రదాయాలను కాపాడుతూ.. వారి అభివృద్ధి కోసం భద్రాచలం ఐటీడీఏ కృషి చేస్తోంది. దీనిలో భాగంగా గిరిజనులు తయారు చేసే పనిముట్లు.. వారు ధరించే ఆభరణాలను ఈ మ్యూజియంలో భద్రపరుస్తున్నారు.
అన్ని వస్తువులూ..
మ్యూజియంలో బోండా, కోయ, లంబాడి గిరిజన మహిళలు ధరించే ఆభరణాలను ప్రదర్శనకు ఉంచారు. ఆదివాసీలు వెదురుతో తయారు చేసిన బుట్టలు, వాగులో నీరు తోడు కోవడానికి వాడే తెడ్డులు, ఎండిన సొరకాయతో తయారుచేసిన వంట సామాగ్రి, వడ్లు దంచడానికి వాడే కొయ్య రోళ్ళు, రోకళ్ళు, తిరగలి, కల్లు తాగే ముంతలు.. తదితర వస్తువులు ఏర్పాటు చేశారు.
జంతువులను వేటాడడానికి వాడే బాణాలు.. బండ కత్తులు, గొడ్డలి కొమ్ములు, జంతువులకు కట్టే గంటలు, నృత్యం చేసేటప్పుడు ధరించే తలపాగా, కొమ్ములు.. వారు ఆరాధించే దేవతల విగ్రహాలు ఇలా ఎన్నెన్నో చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
ఆదివాసీల అభివృద్ధికి ఇలాంటి వినూత్న కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఐటీడీఏ అధికారులు అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి : అంబులెన్స్‌లోనే పాపకు జన్మనిచ్చిన తల్లి