తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రాణం కోసం మంత్ర వైద్యం! - తెలంగాణ ఛత్తీస్​గఢ్​ సరిహద్దులోని ఆదివాసీల బతుకులు

ఆధునిక యుగంలో ఉన్నప్పటకీ ఆదివాసీల బతుకు చిత్రం మాత్రం మారడం లేదు. సాంకేతిక, విద్య, వైద్య రంగాల్లో ప్రపంచం దూసుకుపోతున్నా.. అడవులను నమ్ముకుని ఉన్న వీరికి మాత్రం ఇంకా మంత్ర వైద్యమే దిక్కయింది. తెలంగాణ-ఛత్తీస్​గఢ్​ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో నివసించే ఓ తల్లి.. తన 10 నెలల పసికందును బతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు చూస్తే.. వారు ఎంత దీన స్థితిలో ఉన్నారో అర్థమవుతుంది.

ప్రాణం కోసం మంత్ర వైద్యం!
ప్రాణం కోసం మంత్ర వైద్యం!

By

Published : Jan 17, 2021, 9:22 AM IST

తెలంగాణ ఛత్తీస్​గఢ్​ సరిహద్దు అటవీ ప్రాంతాల్లోని ఆదివాసీలకు ఏదైనా జబ్బు చేసినా, ప్రమాదం జరిగినా ప్రాణాల కోసం మంత్రాలే దిక్కుగా మారుతున్నాయి. వైద్యం కోసం దేవరలనే నమ్ముకుంటున్నారు. దానికి ఉదాహరణ ఈ ఘటన..

పైన ఫొటోలో ఉన్న పసివాడి పేరు మడివి గంగయ్య. వయసు 10 నెలలు. స్వగ్రామం ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా జెట్టిపాడు. తల్లి పేరు ఉంగి. తండ్రి కొంతకాలం కిందట చనిపోయాడు. ఉంగికి ముగ్గురు పిల్లలు. గంగయ్య చిన్నవాడు. కొద్దిరోజులుగా ఆ బాబు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో కీకారణ్యం నుంచి కాలినడకన ఉంగి.. చర్ల మండలం ఎర్రంపాడులోని తన పుట్టింటికి బిడ్డను తీసుకెళ్లింది. అక్కడే దేవర్ల వద్ద మంత్ర వైద్యం చేయించింది.

గంగయ్య

సమయానికి ఎదురైంది

శనివారం ఉంగి తన స్వగ్రామానికి తిరుగుమొహం పడుతున్న సమయంలో చిన్నపిల్లలకు టీకాలు వేసేందుకు ఆ గ్రామానికి వెళ్లిన ఏఎన్ఎం రాజేశ్వరి ఎదురైంది. బాబు శ్వాస తీసుకోవడం కష్టంగా మారడాన్ని గుర్తించిన రాజేశ్వరి.. వెంటనే చెన్నాపురానికి బయలుదేరి అక్కడి నుంచి 108 సాయంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. సకాలంలో బాబును ఆమె ఆస్పత్రికి తరలించటంతో బాలుడికి ప్రాణాపాయం తప్పింది.

బాబును అంబులెన్స్​లో ఆస్పత్రికి తరలిస్తున్న ఏఎన్​ఎం

ఇదీ చదవండి:రాత్రివేళలో పెద్దపులి సంచారం.. రంగంలోకి రెస్క్యూ బృందాలు

ABOUT THE AUTHOR

...view details