Bhadradri Temple: భద్రాద్రి రామయ్య ఆలయంలో హోమశాలలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీ సమేత సీతారాములతో పాటు గరుడ పటాన్ని ధ్వజస్తంభం వద్దకు తీసుకొచ్చారు. తిరు కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ పట ఆవిష్కరణ ఉత్సవం నిర్వహించారు. వేదపండితులు, మంత్రోచ్ఛారణలతో అత్యంత వైభవంగా చేపట్టారు. పూజల అనంతరం గరుడ ప్రసాదాన్ని మహిళలకు పంపిణీ చేశారు. ఈ ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల సంతానం లేని మహిళలకు గర్భ దోషాలు తొలగిపోతాయని మహిళలు విశ్వసిస్తారు.
పెద్దసంఖ్యలో హాజరైన భక్తులు: రామయ్య సన్నిధిలో స్వామివారి గరుడ ప్రసాదాన్ని స్వీకరించేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సుమారు రెండు గంటల పాటు నిర్వహించిన ఈ వేడుకలో ఆలయ వైదిక, అర్చక కమిటీలతో ఆలయ ఈవో శివాజీ పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం భేరీ పూజ, దేవత ఆహ్వానం, బలిహరణం వేడుకలు నిర్వహించి స్వామివారికి హనుమత్ వాహనంపై తిరువీధి సేవ జరపనున్నారు. రేపటి నుంచి ప్రధాన ఘట్టాలు ప్రారంభం కానున్నాయని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు.
ఈనెల 11న మహా పట్టాభిషేకం: శనివారం సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సీతారాములకు ఎదుర్కోలు మహోత్సవం నిర్వహిస్తారు. ఈనెల 10న మిథిలా ప్రాంగణంలో ఉదయం 10.30 గంటల నుంచి 12. 30 గంటల వరకు సీతారాముల కల్యాణ వేడుకను నిర్వహిస్తారు. ఈనెల 11న మహా పట్టాభిషేకం వేడుక జరగనుంది. పట్టాభిషేకం వేడుకకు రాష్ట్ర గవర్నర్ తమిళి సై, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరుకానున్నారు.