ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో రెండు నెలలుగా గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద తీవ్రత కారణంగా నదీ తీర గ్రామాలు ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఇంతటి ప్రమాదకర పరిస్థితులు ఉన్న సమయంలో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నడిచే బోట్లు నిలిపివేసినా కాసుల కక్కుర్తితో ప్రైవేటు బోటు యాజమాన్యాలు మాత్రం యధేచ్ఛగా బోట్లు నడుపుతూనే ఉన్నాయి. దేవీపట్నం వద్ద గోదావరిపై బోట్లు తిప్పుతూ సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రమాదమని తెలిసినా నిబంధనలు ఉల్లంఘిస్తూ ఎంతో మంది కుటుంబాలకు తీరని వేదన మిగుల్చుతున్నాయి. దుర్ఘటన జరిగినపుడు మాత్రం హడావుడి చేసే ప్రజాప్రతినిధులు, అధికారులు దీర్ఘకాలిక చర్యలపై దృష్టి సారించకపోవడం వల్ల పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదు. ఫలితంగా ఎందరో అమాయకుల ప్రాణాలు గోదావరిలో కలిసిపోతున్నాయి.
వారి అలసత్వంతో
లాంచీ యాజమాన్యాల అత్యాశకు, అధికారుల అలసత్వానికి ఆదివారం తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో జరిగిన విషాద ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. నదిలో 5 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతున్నా పర్యాటక లాంచీలు నడిపేందుకు అనుమతించటం అందరినీ ఆగ్రహానికి గురిచేస్తోంది. ప్రమాదానికి గురైన రాయల్ వశిష్ఠ బోటు పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం సింగనపల్లి నుంచి బయలుదేరింది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద పోలీసులు, రెవెన్యూ, జలవనరులశాఖ సిబ్బంది తనిఖీలు నిర్వహించాల్సి ఉండగా అలాంటివేమీ జరగనట్లు తెలుస్తోంది. ఈ అలసత్వమే ఇంతమంది పర్యాటకుల ప్రాణాల మీదికి తెచ్చింది.
దేవీపట్నం వద్ద రాయల్ వశిష్ఠ లాంచీని తనీఖీ చేసి ఉంటే వరద ఉద్ధృతి అధికంగా ఉండటం వల్ల ప్రయాణం సురక్షితం కాదని తిరస్కరించేవారు. పటిష్ఠమైన తనిఖీలేవీ జరగనందునే బోటు ముందుకు సాగిపోయింది. పాపికొండల ప్రాంతం ప్రారంభమయ్యాక నది వెడల్పు తగ్గి లోతు పెరుగుతుంది. పైగా వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటం వల్ల పరిస్థితి మరింత ప్రతికూలంగా పరిణమించింది. దీనివల్ల కచ్చులూరు వద్ద గోదావరి వరద ఉద్ధృతికి బోటు తిరగబడింది.