సీపీఎం మాజీ ఎమ్మెల్యేల స్మారకార్థం స్థూపాలు నిర్మించాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. అనుకున్నదే తడువుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ప్రధాన రహదారి పక్కన స్తూపాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పనులు కూడా చేపట్టారు. సీపీఎం నాయకులు నిర్మించ తలపెట్టిన మాజీ ఎమ్మెల్యేల స్తూపాలను ఆర్టీసీ యాజమాన్యం పోలీసుల సహకారంతో కూల్చివేసింది. నిర్మాణంలో ఉన్న స్తూపాలను కూల్చేస్తున్న సమయంలో అక్కడికి సీపీఎం నాయకులు చేరుకుని ఆర్టీసీ, పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
నిర్మాణాలకు అనుమతి లేదు
దివంగత సీపీఎం మాజీ ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య గత సంవత్సరం కరోనాతో మృతి చెందగా, కుంజా బొజ్జి శ్వాసకోస వ్యాధితో ఈ ఏడాది మృతి చెందారు. వారి స్మారకార్థం స్థూపాలు నిర్మిస్తున్నారు. అయితే స్తూపాలను నిర్మిస్తున్న స్థలం ఆర్టీసీకి చెందిందని.. అందులో ప్రైవేట్ కట్టడాలు నిర్మించకూడదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. నిర్మాణానికి ఎలాంటి అనుమతి లేదన్నారు.