ఉమ్మడి ఖమ్మం జిల్లాపై భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. కొద్దిరోజులుగా కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలోని పలు మండలాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ను దాటి నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధి కూలీలు ఎండ వేడికి తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు.
క్షేత్రస్థాయిలో కనీస సౌకర్యాలు కరవు
కూలీలకు పని ప్రాంతాల్లో కావాల్సిన సదుపాయాలను కల్పించడంలో సంబంధిత అధికారులు విఫలమవుతున్నారు. కనీసం పరదాలు ఉండటం లేదు. ఎవరికైనా గాయాలైతే ప్రథమ చికిత్స చేయడానికి కిట్లు అందుబాటులో లేవు. పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా రూ.వేల కోట్లు వెచ్చిస్తున్నా.. క్షేత్రస్థాయిలో కనీస సౌకర్యాలు కల్పించడంతో మాత్రం వెనుకబడుతున్నాయి.
ఉపాధి కూలీలు - సమస్యలు
- జీవనోపాధి నిమిత్తం ఇన్నాళ్లూ వేరే ప్రాంతాల్లో ఉంటున్న కొందరు కూలీలు లాక్‌డౌన్ నేపథ్యంలో సొంతూళ్లకు వస్తున్నారు. వీరంతా ఉపాధి పనులకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో గతేడాది కంటే ఈ ఏడాది 70,000 మంది అధికంగా ఉపాధి పనులకు హాజరవుతున్నారు.
- 90 శాతం పని ప్రాంతాల్లో నీడనిచ్చే పరదాల్లేవు. ఉన్న కొన్నిచోట్లా చిరిగినవి, అరకొరగా దర్శనమిస్తున్నాయి. రాష్ట్రస్థాయి నుంచే రెండేళ్లుగా పరదాల సరఫరా లేదన్నది క్షేత్రస్థాయి సిబ్బంది వాదన.
- ఎండల తీవ్రత నేపథ్యంలో కూలీలు వడదెబ్బకు గురవుతున్నారు. ఉపాధి కూలీల్లో వృద్ధుల సంఖ్య కూడా అధికంగా ఉంటుంది. వీరు పనిలో విశ్రాంత కోసం సమీప చెట్లను ఆశ్రయిస్తున్నారు. కొందరు వడదెబ్బకు గురై ఆసుపత్రుల్లో చేరుతున్నారు.
- పనులకు పలుగులు, పారలను ఎక్కువగా వినియోగిస్తారు. వాటి కారణంగా ఎవరైనా గాయాలకు గురైతే ప్రథమ చికిత్స చేసేందుకు కిట్లు అందుబాటులో లేవు. మూడేళ్ల క్రితం వరకు అరకొరగా వీటిని సరఫరా చేసి ఆ తర్వాత చేతులెత్తేశారు. అందుబాటులో ఉన్నవి కాలం చెల్లాయి. ఎవరికైనా గాయాలైనా, అస్వస్థతకు గురైనా ప్రాథమిక ఆసుపత్రులకు పరుగు పెట్టాల్సివస్తోంది.
- ఉపాధి కూలీలకు ఏటా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసేవారు. ఈ ఏడాది వాటి జాడేలేదు. ఉన్నతాధికారులు స్పందించి ఉపాధి పనుల ప్రాంతాల్లో సౌకర్యాలు కల్పించాలని కూలీలు వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి:భాగ్యనగర శివారులో విజృంభిస్తోన్న కరోనా