Papikondalu tourism start: గోదావరి నదిలో పాపికొండలు విహారయాత్రను నేటి నుంచి పునఃప్రారంభించారు. విహారయాత్రకు ఏపీ ప్రభుత్వం పచ్చజెండా ఊపటంతో... నిన్న అధికారులు ట్రయల్ రన్ జరిపి, ఏర్పాట్లన్నీ పూర్తిచేశారు. ఏపీకి చెందిన రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంత బాబు తొలి బోటును ప్రారంభించారు. దీంతో సుదీర్ఘ విరామం తర్వాత ఈ ప్రాంతంలో మళ్లీ సందడి మొదలైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గోదావరి గుండా ఆంధ్రప్రదేశ్లోని పాపికొండల వరకు సాగే ఈ విహారయాత్రకు... తొలిరోజు భద్రాచలం నుంచి వంద మందికి పైగా పర్యాటకులు విహారయాత్రకు వెళ్లారు.
6 లాంచీలకు మాత్రమే అనుమతి...
గతంలో పలు ఘటనలు నేర్పిన పాఠంతో భవిష్యత్తులో ప్రమాదాలకు ఆస్కారం లేకుండా... ప్రస్తుతం 6 లాంచీలకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అనుమతిచ్చింది. ఒక్కో లాంచీలో 80 మంది మాత్రమే ప్రయాణించాలని నిబంధన విధించింది. విహార యాత్రకు వెళ్లాల్సిన వారు ఉదయం 5 గంటల నుంచి 8లోపే భద్రాచలంలోని రామాలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న కౌంటర్‌లో టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారు సైతం ఇదే కౌంటర్‌లో నమోదు చేసి... ప్రైవేటు వాహనాల్లో లాంచీ బయలుదేరే పోచవరానికి ఉదయం 10గంటల లోపు చేరుకోవాల్సి ఉంటుంది. సాయంత్రం 4 గంటల లోపు పోచవరంలో పాపికొండల యాత్ర ముగుస్తుంది.
యాత్ర తిరిగి ప్రారంభించటంతో పర్యాటకులు సహా లాంచీల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:Corona Vaccine to Old Woman : వ్యాక్సిన్ తీసుకోగానే వృద్ధురాలికి పూనకం.. షాక్లో వైద్యసిబ్బంది