Sri Ramanavami celebrations in Bhadrachalam: సీతారామ కల్యాణ పనులు ఈనెల 7న పాల్గున పౌర్ణమి నాడు శ్రీకారం చుట్టునున్నారు. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం రోలు, రోకలికి పూజలు చేసి పసుపు కొమ్ములు దంచి పనులు ప్రారంభిస్తారు. తదుపరి సీతారాముల కల్యాణానికి వాడే తలంబ్రాలను తయారు చేస్తారు. అదే రోజు డోలోత్సవం, వసంతోత్సవం వేడుకలు నిర్వహించనున్నారు.
ప్రతి ఏడాది ఈ ఉత్సవాన్ని చిత్రకూట మండపంలో నిర్వహించే ఆలయ అధికారులు... ఈ ఏడాది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని భావించి ఉత్తర ద్వారం వద్ద ఏర్పాటు చేస్తున్నారు. అన్ని ఆలయాల్లో కల్యాణానికి వాడే తలంబ్రాలు పసుపు రంగులో ఉంటాయి కానీ భద్రాద్రి రామయ్య సన్నిధిలో వాడే తలంబ్రాలు మాత్రం ఎరుపు రంగులో ఉంటాయి.
భక్త రామదాసు కాలం నుంచి అప్పటి తానీషా ప్రభువు పంపించే బుక్కా గులాబులు, నెయ్యి, పసుపు, సుగంధ ద్రవ్యాలు కలిపి తలంబ్రాలను తయారు చేస్తారు.
తలంబ్రాలు కలిపే వేడుకలో ముత్తైదువులు అధిక సంఖ్యలో పాల్గొని తలంబ్రాలు కలవటానికి పోటీపడతారు. ఆరోజు నుంచి మార్చి 30న జరగనున్న సీతారాముల కల్యాణ మహోత్సవానికి 31న జరగనున్న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకానికి పనులు ప్రారంభించనున్నారు.
ఈసారి లక్షల సంఖ్యలో భక్తులు కళ్యాణ మహోత్సవానికి హాజరుకానున్న నేపథ్యం లో భక్తులకు ఉచితంగా పంపిణీ చేసేందుకు 180 క్వింటాళ్ల తలంబ్రాలను తయారు చేయాలని ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణానికి వచ్చే భక్తుల అంచనాను బట్టి రెండు లక్షల వరకు లడ్డు ప్రసాదాన్ని తయారు చేయడానికి నిర్ణయించారు.