Sri Rama Navami Thirukalyana Brahmotsavam started: భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఈరోజు నుంచి శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ముందుగా ఉగాది పర్వదినం సందర్భంగా లక్ష్మణ సమేత సీతారాములకు విశేషాభిషేకం అర్చకులు నిర్వహించారు. అనంతరం ఉగాది పచ్చడిని భక్తులకు పంపిణీ చేశారు. బ్రహ్మోత్సవాలకు ఓంకార ధ్వజ ఆరోహణ, విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనం, రక్షా సూత్రముల పూజ, రక్షాబంధనం, రుత్విక వరణం కార్యక్రమాలను పూజారులు నిర్వహించారు. తరువాత 118 మంది పండితులకు దీక్ష వస్త్రాలు ఆలయ అధికారులు అందించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం పంచాంగ శ్రవణం జరగనుంది. అనంతరం ప్రతి వ్యక్తి ఈ సంవత్సర ఆదాయ వ్యయాలు తెలపనున్నారు.
గురువారం అగ్ని మథనం కార్యక్రమం: తదుపరి గోవిందరాజు స్వామి వారి ఆలయం నుంచి పుట్ట మట్టిని తీసుకొచ్చి బ్రహ్మోత్సవాలకు సామ్రాజ్య పట్టాభిషేకం, శ్రీరామాయణ మహా క్రతవుకు అంకురార్పణ నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా రేపు ఉదయం అగ్ని మథనం కార్యక్రమం ఉంటుందని అధికారులు తెలిపారు. ఇలా ప్రతి రోజు ఏదో ఒక వేడుక నిర్వహిస్తామని ఆలయ వేద పండితులు మురళీ కృష్ణమాచార్యులు తెలిపారు. ఉగాది పండగ అయినందున భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చారని ఆలయ అధికారులు తెలిపారు.